Viral: అంగరంగ వైభవంగా వివాహ రిసెప్షన్ వేడుక జరుగుతోంది. ఇంతలో అనుకోని అతిథులు ఆ వేడుకలోకి ఎంటర్ అయ్యారు. అంతే అప్పటి ఉన్న ఆహ్లాదకరమైన సీన్ కాస్తా.. టెన్షన్ సీన్‌లా మారిపోయింది. ఆ అతిథులను చూసి వేదికపై ఉన్న వరుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సయ్యద్ నజీర్‌కు సనా సమ్రీన్ అనే మహిళతో వివాహం జరిగింది. అయితే, తన మొదటి భార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, తన భర్త రెండో పెళ్లి గురించి తెలుసుకున్న మొదటి భార్య సనా సమ్రీన్.. పోలీసులను వెంటబెట్టుకుని వచ్చింది.
ఓవైపు రిసెప్షన్ వేడుక జరుగుతుండగా.. మరోవైపు సమ్రీన్ పోలీసులను వెంటబెట్టుకుని వచ్చింది. ఆ వేడుకను అడ్డుకుంది. దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సందట్లో సడేమియా అన్నట్లుగా నజీర్ ఇంట్లోకి దూరి వెనుక తలుపు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై సమ్రీన్ సోదరుడు మీడియాతో మాట్లాడారు. ‘మా చెల్లి న్యూజిలాండ్ నుంచి వచ్చాక 2019లో సయ్యద్‌తో వివాహం చేశాం. లాక్‌డౌన్ సమయంలో మొత్తం మా వద్దే ఉన్నాడు. రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. మేం ఇవ్వలేదు. అప్పటి నుంచి మా చెల్లిని దూరం పెడుతూ వచ్చాడు.’ అని చెప్పాడు. ఇక సమ్రీన్ మాట్లాడుతూ.. డబ్బుల కోసం తనను నిత్యం వేధించేవాడంది. ‘నేను ఒక డాక్టర్‌ని. కోవిడ్ 19 సెకండ్ వేవ్ సమయంలో సయ్యద్ మామకు కోవిడ్ పాజిటివ్ చ్చింది. ఆ సమయంలో నేను వారికి సేవ చేశా. లాక్ డౌన్ సమయంలో నేను సంపాదించిన డబ్బునంతా వారికి ఇచ్చాను. అయినా డబ్బుల కోసం వేధించాడు. రెండో పెళ్లి విషయంలో నా భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాను. అతను తప్పించుకున్నాడు. అతనిపై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.’ అని చెప్పుకొచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..