Telangana: జాతకం చెప్పించుకునేందుకు వచ్చిన వ్యక్తుల్ని దొంగలుగా భావించారు.. కట్ చేస్తే..

| Edited By: Ram Naramaneni

Sep 11, 2024 | 12:58 PM

అది తెల్లవారుజాము సమయం. గ్రామంలోకి ఓ కారు వచ్చింది. అందులో నుంచి నలుగురు వ్యక్తులు దిగారు. నెమ్మదిగా ఓ ఇంటివైపు నడవసాగారు. వారిని దొంగలుగా భావించారు గ్రామస్థులు.. ఆ తర్వాత...

Telangana: జాతకం చెప్పించుకునేందుకు వచ్చిన వ్యక్తుల్ని దొంగలుగా భావించారు.. కట్ చేస్తే..
Village (Representative image)
Follow us on

అనారోగ్యం బారిన స్నేహితుడిని పరామర్శించేందుకు వెళ్లిన యువకులను దొంగలుగా భావించి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు చెందిన సత్తిరెడ్డి తన కారులో చౌటుప్పల్‌ మండలం చిన్నకొండూర్‌ గ్రామానికి చెందిన గరిగె లక్ష్మీ నారాయణ, పగడాల ప్రకాశ్‌, పాపగల్ల లింగస్వామితో కలిసి బీబీనగర్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో పోచంపల్లి మండలం దోతిగూడెం మీదుగా వెళ్తూ అదే గ్రామంలో సత్తిరెడ్డికి తెలిసిన జాతకాలు చెప్పే యాట లింగస్వామి ఇంటికి వెళ్దామనుకున్నారు. తెల్లవారుజామున యాట లింగస్వామిని పలకరించేందుకు అతడి ఇంటికి వెళ్లారు. వారు తమ కారు దిగి ఇంటి గల్లీలోకి వెళ్తుండగా చీకట్లో అదే గ్రామానికి చెందిన యాట నరేష్ చూసి ఎవరో ఎవరో వ్యక్తులు వచ్చారని, దొంగలుగా భావించి వారిని పట్టుకుని బిగ్గరగా కేకలు వేశాడు. చుట్టుపక్కల గణేష్ మండపాల వద్ద ఉన్న యువకులు హుటాహుటిన వచ్చి ముగ్గురు యువకులను పట్టుకొని చితకబాదారు.

కాగా, యువకులు తాము దొంగలం కాదని, లింగస్వామి ఇంటికి వచ్చామని చెప్పినా వారు వినిపించుకోలేదు. వెంటనే డయల్-100కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెంటనే చేరుకుంది. పోలీసులు.. గ్రామస్తుల చెర నుంచి ఆ యువకులను విడిపించి విచారించారు. గతంలో యాటలింగస్వామి జాతకాలు చెప్పించుకున్నామని, మరోసారి అతడిని పలకరిద్దామని వచ్చామని చెప్పారు. గ్రామస్థులు దాడిలో గాయపడ్డ యువకులను పోలీసులు చికిత్స కోసం బీబీనగర్ ఆసుపత్రికి తరలించారు.

Victims

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.