Vikarabad: విధి నిర్వహణలో భాగంగా పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంటారు. తమకు ఎదురైన సవాళ్లను, లక్ష్యాలను ఎంతో ధైర్యంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అటువంటి సవాలే ఓ పోలీసు అధికారికి ఎదురైంది. అందరూ భయపడుతున్న వేళ.. తాను మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చాడు. చివరికి గ్రామస్తుల చేత చప్పట్లతో అభినందనలు అందుకున్నారు. ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు మంగళవారం అర్థరాత్రి అదే గ్రామంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఏడుకొండ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
యువకుడు నరేష్ ఆత్మహత్య చేసుకున్న బావిని పరిశీలించారు. బావిలోకి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేకపోవడంతో తాళ్లు అందులోకి వేశారు. అయితే, యువకుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహకరించాల్సిందిగా గ్రామస్తులను ఎస్ఐ ఏడుకొండలు కోరారు. కానీ, గ్రామస్తులు భయంతో ముందుకు రాలేదు. దాంతో వెంటనే రియాక్ట్ అయిన ఎస్ఐ ఏడుకొండలు.. తాడు సాయంతో తానే స్వయంగా బావిలోకి దిగారు. నీటిపై తేలియాడుతున్న శవాన్ని బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఎస్ఐ చేసిన సాహసానికి గ్రామస్తులు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. ఇక యువకుడి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Also read:
Benefits of Flax Seeds: ఆరోగ్యానికి ‘అవిసె గింజలు’.. మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. ఎందుకంటే?