
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. అయితే, విజయశాంతి చేరబోతున్న పార్టీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఇటీవల విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. స్వయానా.. కాంగ్రెస్ నేత మల్లు రవి.. ఆమె కాంగ్రెస్‌లో చేరతారంటూ ఈనెల 11న చెప్పారు. అప్పుడు స్పందించిన విజయశాంతి.. అలాంటిదేమీ లేదంటూ ఖండించారు. ఖండించిన నాలుగురోజుల్లోనే విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం కాషాయ పార్టీలో సంచలనంగా మారింది.
తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదే. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు. అది, ఎప్పటికీ… pic.twitter.com/ASWAOc5Z9B
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 15, 2023
విజయశాంతి మాత్రమే కాదు.. మరికొందరు కూడా త్వరలో రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరతారంటూ మల్లు రవి చెప్పగా.. అదే విషయాన్ని టీవీ9 విజయశాంతిని అడిగింది. అప్పుడు స్పందించిన విజయశాంతి అలాంటిదేమీ లేదని, మోదీని ఆహ్వానించడానికి ఎయిర్‌పోర్ట్‌కు కూడా వచ్చాను కదా అంటూ చెప్పారు.
అయితే, విజయశాంతి మూడుసార్లు మోదీ సభలకు హాజరుకాలేదు.. దీంతో రాజీనామా చేస్తారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ పార్టీ నేతలతో విబేధాలపై విజయశాంతి చేసిన ట్వీట్లు అనేకసార్లు గందరగోళానికి గురిచేసిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..