Vijayashanti: కిషన్‌రెడ్డి అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం మధ్యలోనే బయటకొచ్చిన రాములమ్మ

రాములమ్మకి మళ్లీ కోపమొచ్చిందా..? కిషన్‌రెడ్డి అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం మధ్యలో ఆమె బయటకు ఎందుకొచ్చేశారు..? మాజీ సీఎం, సమైక్యవాది కిరణ్‌కుమార్‌రెడ్డి స్టేజీ మీద కనిపించడం ఆమెకు ఇష్టంలేదా..? అందుకే..విజయశాంతి అక్కడ ఉండలేకపోయారా? ఇంతకీ.. నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఏం జరిగింది?

Vijayashanti: కిషన్‌రెడ్డి అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం మధ్యలోనే బయటకొచ్చిన రాములమ్మ
Vijayashanthi

Updated on: Jul 21, 2023 | 9:28 PM

విజయశాంతి… బీజేపీలో ఆమె ఓ ఫైర్‌ బ్రాండ్‌. తానూ చెప్పాల్సిన విషయాలను ఎలాంటి మొహంమాటం లేకుండా ఖరాకండిగా చెప్పేస్తారామె. మొన్నటికి మొన్న రాజాసింగ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత గానీ, బండి సంజయ్‌ అధ్యక్ష మార్పు విషయంలో ట్వీట్‌ చేస్తూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణాలేంటో చెప్పకుండా తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు విజయశాంతి. ఇక తాజాగా నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన జి.కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి రాములమ్మ హాజరయ్యారు. కిషన్‌రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. కాసేపు అక్కడే ఉన్న విజయశాంతి, సడెన్‌గా కనిపించకుండా పోయారు. కారణం ఏంటా అని మీడియా ప్రతినిధులు ఆరా తీస్తే, ఆమె అసంతృప్తితో బయటకు వెళ్లినట్లు తెలిసింది. ఈలోపే తానూ వెళ్లడానికి రీజనేంటో వివరిస్తూ..ఓ ట్వీట్‌ రిలీజ్‌ చేయడం కలకలం రేపింది.

కిషన్‌రెడ్డి అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొనడం విజయశాంతికి నచ్చలేదట. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదానికి జై కొట్టిన ఆయన్ని..స్టేజీ మీద సన్మానించడం, బీజేపీ నేతలు పొగటం ఆమె తట్టుకోలేకపోయారట. దాంతో అసౌక్యరంగా అక్కడ ఉండలేక మధ్యలోనే ఇంటికొచ్చేసినట్లు ట్వీట్‌లో వెల్లడించారు రాములమ్మ.  నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి…కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ధిక్కరించి మరీ..మతతత్వ ఎంఐఎం సోదరులను జైలుకు పంపించారని పొగిడారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.

పాతబస్తీలో ఎంఐఎం సోదరులను జైలుకు పంపించిన చరిత్ర ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. మొత్తానికి రాములమ్మ అలకకు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని తెలిసిపోయింది. మరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విజయశాంతి నెక్ట్స్‌ ఏం చేయబోతున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..