నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి.. మాడు పగుల గొట్టాయి.. ఇప్పుడు కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. కడుపులు మాడగొడుతున్నాయి.. పచ్చిమిర్చి మంట పుట్టిస్తుంటే.. టమాటా స్వీట్ వార్నింగ్ ఇస్తూ దడ పుట్టిస్తోంది. మిగిలిన బెండ, దొండ, బీర, సొరకాయ, వంకాయలు కూడా షాక్ కొట్టే ధరలతో భయపెడుతున్నాయి.
తెలుగురాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఏది కొందామన్నా గుండెదడ పుట్టేలా ఉంది పరిస్థితి. సంచి నిండా వెజిటబుల్స్ తెద్దామనుకుని వెళ్లిన వాళ్లు.. ఆ పెరిగిన ధరలు చూసి ఉన్న డబ్బులతో హ్యాండ్ బ్యాగుల్లో కూరగాయలను సర్దుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. అంతగనం పెరిగాయి మరి ధరలు. విశాఖ రైతు బజార్‌లోకి అడుగు పెట్టగానే వెజిటబుల్స్ ఊరిస్తాయి. ముట్టుకుంటే మాత్రం షాక్ కొడతాయి. అల్లం కిలో 300, వెల్లుల్లి 200, పచ్చిమిర్చి కిలో 120, టమోటా అయితే 100 రూపాయలకు చేరుకుని ఇంకా ఎగబాకడానికి రెడీగా ఉంది. పెరిగిన ధరలతో ప్రజల హైరానా మామూలుగా లేదు.
వాస్తవానికి రైతు బజార్లు, రిటైల్ మార్కెట్ల రేట్లే జనాన్ని భయపెడుతున్నాయి. ఇక..బయటి మార్కెట్లు, తోపుడు బళ్లలో.. ఇంటిదగ్గర చిన్న చిన్న కొట్లలో ధరలు వింటే గుండె దడ పుడుతుంది. బీరకాయ, దొండకాయ, బెండకాయ మాత్రమే కాదు.. బీన్స్ కూడా 85 నుంచి 125 రూపాయల వరకు ధర పలుకుతోంది. అది కూడా రైతు బజార్లలోనే. ఇక ఓపెన్ మార్కెట్లలో అయితే కిలో రూ. 150కి తగ్గేదేల్యా అంటున్నారు.
వాస్తవానికి టమాట బెంగళూరు, మదనపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు దిగుమతి అవుతుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల నుంచి దిగుబడి తగ్గిపోయింది. ఇదే రేటు పెరుగుదలకు కారణమని అంటున్నారు. వర్షాకాలం ప్రారంభంలో మిర్చి రేటు సహజంగా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ స్థాయిలో పెరగడం మాత్రం విడ్డూరంగానే ఉందంటున్నారు జనం. ఏదేమైనా వంటింట్లో కూరల్లో తప్పకుండా వేయాల్సినవే తాకొద్దంటున్నాయి. ఈ రేట్లు ఎప్పుడు దిగొస్తాయో ఏమో.
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎర్రగడ్డ రైతు బజార్‌లో ఎంటరవ్వగానే..అక్కడి ధరల పట్టిక చూస్తే..కొనడానికి వెళ్లిన వాళ్లకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ‘అబ్బబ్బబ్బా.. ఏం రేట్లురా నాయనా.. ఈ ధరలు ఎక్కడా చూడలేదు.. అయినా వానాకాలంలో కూడా ఇంత మండిపోతున్నాయేంట్రా’.. హైదరాబాద్‌లో రైతు బజార్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినిపిస్తోంది.
కూరగాయలన్నీ రాశులు పోసినట్లుగా ఊరిస్తున్నా ఏదీ కొనలేని పరిస్థితి ఉంది. అన్నీ సెంచరీ ఎప్పుడో దాటేశాయి. టమాటాకైతే అస్సలు మనసు లేదు. సాయంత్రం దాకా కిలో 80 రూపాయలుంది. రాత్రయ్యేసరికి సెంచరీ కొట్టేసింది. మంగళవారానికి వందకూ మంగళం పాడేసి 120కి వెళ్లినా ఆశ్చర్యం లేదని రైతు బజార్ టాక్. ఇక, మిర్చి 120 రూపాయల మార్క్ ఎప్పుడో దాటేసింది. ఇవి మాత్రమే కాదు.. బీరకాయ, బీన్స్, వంకాయ ఏవి కొనాలన్నా జేబులకు చిల్లులు తప్పడం లేదు.
మరిన్ని తెలంగాణ&ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..