
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటుగానే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయనే భ్రమలో ఎవరూ ఉండకూడదని అన్నారు. శాసన సభ ఎన్నికలు.. అలాగే లోక్ సభ ఎన్నికలు రెండు వేరువేరుగానే జరుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, బీఆరఎస్ పార్టీని ఓడించాలనే కసి, పట్టుదల బీజేపీ నేతలు, కార్యకర్తల్లో కనిపిస్తోందని అన్నారు. మరో విషయం ఏంటంటే బీఆర్‌ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ఎలాంటి పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు.. అలాగే పలువురు ముఖ్య నేతల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బీఆర్ఎస్, బీజేపీల మధ్య స్నేహం ఉందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి స్నేహం లేదని.. భవిష్యత్తులో ఉండదని చెప్పారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా ఒక్కటేనన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జిగా ఉన్నప్పటికీ కూడా.. ఇప్పుడున్న పార్టీకి ఎంతో మార్పు కనిపిస్తోందని రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇంఛార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై పొరాడితే కచ్చితంగా గెలుపొందాలనే పట్టుదల బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్.. బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ఇప్పటికే స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయవల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు.
ఇదిలా ఉండగా.. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఈ నెల 11వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నేతలు, శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అలాగే నిరుద్యోగ సమస్యలకు సంబంధించి ఈనెల 13వ తేదీన ఉదయం 11 గంటల నుంచి.. 14న ఉదయం వరకు 24 గంటల పాటు ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టనున్నారు. అలాగే 15వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. అలాగే ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరోవైపు సెప్టెంబర్ 26,27,28 తేదీల్లో రాష్ట్రంలో బస్స యాత్రను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్టోబర్ 14న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభతో.. ఈ యాత్రను ముగించాలని నిర్ణయించారు.