Telangana: వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్‌ మంజూరు.. వెల్లడించిన కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వరంగల్‌లో కొత్త సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ మంజూరు చేసింది కేంద్రం. ఈ సెంటర్‌లో ఓపీడీ చికిత్స సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ... ..

Telangana: వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్‌ మంజూరు.. వెల్లడించిన కిషన్ రెడ్డి
Wellness Centre

Updated on: Sep 23, 2025 | 5:14 PM

వరంగల్‌లో మరో కీలక ఆరోగ్య సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కోసం ప్రత్యేకంగా నడిపించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) వెల్‌నెస్ సెంటర్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సెంటర్‌ ద్వారా వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. సీజీహెచ్‌ఎస్ ఒక కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌ అయినప్పటికీ, వెల్‌నెస్ సెంటర్‌లలో ప్రాథమిక ఓపీడీ (OPD) చికిత్స సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా లబ్ధి చేకూరనుందని భావిస్తున్నారు.

ఈ సదుపాయాన్ని వరంగల్‌కు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో.. సబ్కా సాథ్ – సబ్కా వికాస్ ఆవిష్కరణలో భాగంగా ఉద్యోగులు, సమాజం రెండింటి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని” ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

దీని ఏర్పాటు కారణంగా ప్రధాన సౌకర్యాలు:

అత్యవసర వైద్య సహాయం: జీడీఎంఓలు, ఫార్మసిస్ట్‌లు, వైద్య బృందం సమయానికి వైద్య సేవలు అందించనున్నారు.

సంపూర్ణ వైద్య సేవలు: ఓపిడీ కన్సల్టేషన్లు, ఉచిత మందులు, డయాగ్నస్టిక్స్, రిఫరల్స్, ప్రసూతి సేవలు.. వెల్‌నెస్ సెంటర్‌లో అందుబాటులో ఉంటాయి.

సీజీహెచ్‌ఎస్ ప్రయోజనాలు: క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, నిపుణుల వైద్య సేవలు, ఆర్థిక రక్షణ… ఇవన్నీ ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, వారి ఆధారితులకు అందుతాయి.

“ఈ వెల్‌నెస్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు ఇది” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.