Amit Shah: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం.. హోంమంత్రి అమిత్ షా

|

Aug 21, 2022 | 7:23 PM

Amit Shah: తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన కొనసాగుతోంది. మునుగోడులో బీజేపీ సమరభేరి సభకు హాజరై ప్రసంగించారు. ఈ సభలకు పెద్ద ఎత్తున జనాలు..

Amit Shah: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం.. హోంమంత్రి అమిత్ షా
Amit Shah
Follow us on

Amit Shah: తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన కొనసాగుతోంది. మునుగోడులో బీజేపీ సమరభేరి సభకు హాజరై ప్రసంగించారు. ఈ సభలకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. అమిత్‌ షా సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత పలువురు బీజేపీ నేతలు ప్రసంగించారు. అనంతరం అమిత్‌ షా భారత్‌ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు నేడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర అమిత్‌ షా అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా ఈ మునుగోడు సభను చూస్తుంటే అర్థమవుతోందని, రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు నేను ఇక్కడికి వచ్చానని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ సర్కార్‌ పడిపోతుందన్నారు.

ఇచ్చిన మాట అమలు చేయని పాలన కేసీఆర్‌ది:

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్‌ గతంలో చెప్పారని, ఇచ్చిన మాటలు అమలు చేయని పాలన కేసీఆర్‌ది అంటూ మండిపడ్డారు అమిత్‌ షా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తారని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ నిర్వహించడం లేదని, తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కిసాన్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని, తాము అధికారంలోకి వస్తే అన్ని పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు.

ఇవి కూడా చదవండి

కేసీఆర్‌ పేదలకు ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా..?

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు.. కానీ ఇంత వరకు అలా జరగలేదన్నారు. మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నారా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఇచ్చే టాయిలెట్లను కూడా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారని, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో వస్తే మరింత దారుణంగా మారుతుందని సూచించారు.

ప్రతీ దళితుడి కుటుంబానికి రూ.10 లక్షల హామీ ఏమైంది..?

ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ చెప్పారు.. ఎంత మంది దళితులకు 10 లక్షల రూపాయలు అందాయని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు.. ఎవరికైనా అందిందా..? అంటూ అమిత్‌ షా ఉద్వేగంతో ప్రశ్నించారు. 2014 నుంచి టీచర్ల నియామకాలు ఆపేశారని, గిరిజనులకు ఎకరం భూమి ఇస్తాను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే దొడ్డు బియ్యం మొత్తం కొంటామని, దొడ్డు బియ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు మాటలు చెబుతోందని అమిత్‌ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మనుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు పెను మార్పు నాంది:

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు పెనుమార్పునకు నాంది అన్నారు అమిత్‌ షా. ఇది కేవలం రాజగోపాల్‌ రెడ్డి చేరిక సభ కాదన్న అమిత్‌ షా.. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్‌ వెళ్లిపోవడం ఖాయమన్నారు. తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్‌ చేసిందేమీ లేదన్న అమిత్‌ షా.. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తానని మోసగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ప్రధాని ఇస్తున్న టాయిలెట్లలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు తప్పా.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి