
పాతబస్తీ నేర ప్రవృత్తికి అడ్డాగా మారుతోంది. హైదరాబాద్ మహానగరంలో రాను రానూ క్రైమ్ రేటు పెరుగుతోంది. మనిషిని మనిషి చంపుకునే అసాంఘిక కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన భాగ్యనగరానికి, పాతబస్తీ ప్రాంతానికి ఈ ఘటనలు మచ్చగా నిలుస్తున్నాయి. నిన్నటికి నిన్న కేవలం ఐదే ఐదు గంటల వ్యవధిలో రెండు హత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తు్న్నాయి. పాతబస్తీలోని భవానీనగర్ పోలీస్ స్టేషన్, మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 గంటల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో స్నేహితులే తమ వారిని మట్టుపెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జావీద్ అనే యువకుడుని దారుణంగా హత్య చేసి చంపారు. చంచల్‌గూడ జైలు ఎదురుగా ఉన్న ముస్లిం స్మశానవాటికలో ఈ హత్య ఘటన చోటు చేసుకోవడం మరింత కలకలం సృష్టించింది. సోమవారం (ఏప్రిల్ 13) జావీద్(20) అనే యువకుడిని పాత కక్షల నేపథ్యంలో అతని పరిచయస్తులైన ఇద్దరు వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో ఉండే ఓ యువకుడిపై కక్ష పెంచుకునేంతంగా ఏం జరిగి ఉంటుందో పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులు అర్షాద్ (17), మహ్మద్ (18)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, మాదన్నపేట పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు. జావీద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదన్నపేట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరో సంఘటనలో, భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్టాలో సయ్యద్ అబ్దుల్ ఖాదర్ అలీ(20) అనే యువకుడు తన స్నేహితుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడి దాడిలో గాయపడిన అబ్దుల్ ఖాదర్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అబ్దుల్ ఖాదర్‌కు ప్రతిరోజూ తన స్నేహితులతో కలిసి గంజాయి, మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం (ఏప్రిల్ 13) ఖాదర్ తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించాడు. కాసేపటికి స్నేహితుల మధ్య మాటామాటా పెరిగి అది గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకూ గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలో స్నేహితులంతా కలిసి మూకుమ్మడిగా అబ్దుల్ ఖాదర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్నేహితుల దాడిలో ఖాదర్ గాయపడి కింద పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన ఖాదర్‌ను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ ఖాదర్ మృతి చెందాడు. హత్య జరిగినట్లు సమాచారం అందుకున్న భవానీ నగర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..