సాధారణంగా పాము అంటే ఎవరికైనా భయమే. అదే అరుదుగా కనిపించే రెండు తలల పాము కనిపిస్తే..? చూడటానికి ఆసక్తిగా ఉన్నా, భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా..! ఇప్పుడు అలాంటి డబుల్ ఇంజిన్ పాము హైదరాబాద్ మహా నగరంలో తాజాగా కనిపించింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం పక్కన ప్రాంతంలో అరుదైన డబుల్ ఇంజిన్ పాము కనిపించడంతో కాసేపు అక్కడ కలవర వాతావరణం మొదలైంది.
హైదరాబాద్ మహానగరం పాతబస్తీలోని బహదూర్‌పురా ప్రాంతంలో ఉన్నట్లుండి ఓ డబుల్ ఇంజిన్ పాము ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా రెండు తలల పాము కనిపించడంతో అక్కడి ప్రజలు ముందు భయంతో పరుగులు తీశారు. అరుదుగా కనిపించే పాము కాబట్టి కొందరు దూరం నుంచే దాన్ని ఆసక్తిగా చూశారు. ఎలాగోలా ధైర్యం చేసుకుని అక్కడి కొందరు స్థానికులు పామును పట్టుకుని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులకు కృతజ్ఞతలు చెప్పి తదుపరి చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులు ఆ పామును నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులకు అందజేశారు. ప్రస్తుతం పాముకు జూ పార్క్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
డబుల్ ఇంజిన్ పాము ఉన్నట్లు తమకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని, తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనం ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఈ రెండు తలల పాము కనిపించిందని, కొందరు స్థానికుల సాయంతో చాకచక్యంగా దాన్ని బంధించడం జరిగిందని పోలీస్ అధికారి చెప్పారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. అయితే.. ఈ ఘటన స్థానికంగా అక్కడ కొందరిని కాసేపు కలవరపాటుకు గురి చేసినప్పటికీ, తక్షణ చర్యల వల్ల ఎవరికీ అపాయం జరగలేదని పోలీసులు తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..