ఈ ప్రపంచం ఎన్నో వింతల సమాహారం. రోజూ ఏదో ఓ మూలన.. కొత్త వింతలు వెలుగుచూస్తూనే ఉంటాయి. కొన్ని ఘటనలు మరీ ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. తాజాగా అలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. బోథ్ మండలం సొనాల గ్రామంలో.. ఓ కోడి పొదిగిన గుడ్డు నుంచి రెండు పిల్లలు బయటకు వచ్చాయి. సోనాలకు చెందిన తోఫిక్.. కోళ్ల పెంపకం చేస్తూ ఉంటాడు. వాటిలో ఇటీవల ఒక కోడి గుడ్లను పొదిగింది. అయితే సోమవారం రోజున ఒక గుడ్డు నుంచి రెండు పిల్లలు బయటకు రావడంతో తోఫిక్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ పిల్లలు కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు.
ఒక గుడ్డు నుంచి రెండు కోడి పిల్లలు పుట్టాయన్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కవల కోడి పిల్లలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి ఘటన గురించి తామెప్పుడూ వినలేదు, చూడలేదు అంటున్నారు. కాగా ఈ వింతపై స్థానిక పశు వైద్యాధికారి సుశీల్ కుమార్ మాట్లాడుతూ జన్యుపరమైన లోపాలతో ఇలా.. ఒక గుడ్డు నుంచి 2 పిల్లలు పుట్టే ఆస్కారం ఉందన్నారు. ఇలాంటివి చాలా అరుదని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు సైతం కోడికి కవలలు పుట్టాయి తమ బంధువులకు, మిత్రులకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఆ ఫోటోలను వాట్సాప్‌తో ఇతర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు.
ఇక ఇటీవల నిజామాబాద్ జిల్లాలోనూ ఈ మాదిరి ఘటనే వెలుగుచూసింది. మంగళ్ పహాడ్ గ్రామంలో ఓ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒక మేక పిల్ల… తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టింది. ఇది కూడా జన్యుపరమైన లోపమే అంటున్నారు పశువైద్యులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..