
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర హృదయవిదారకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కలుషితమైన డబ్బా పాలు తాగిన కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. తల్లి చేత డబ్బా పాలు తాగిన కవలలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ కుటుంబానికి తీవ్ర గర్భశోకాన్ని మిగుల్చారు.
ఈ విషాద సంఘటన గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగింది. డబ్బా పాలు వికటించి నాలుగు నెలల కవల పిల్లలు మృతి చెందారు. మర్రి లాస్య శ్రీ – అశోక్ దంపతులకు రెండవ సంతానంలో కవల పిల్లలుగా పాప, బాబు జన్మించారు. పిల్లలకు తల్లి పాలు సరిపోకపోవడంతో డబ్బా పాలు పట్టిస్తూ పిల్లలా అలనా పాలన చూసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే శనివారం(ఫిబ్రవరి 22) ఉదయం నుండి పిల్లలకు రెండుసార్లు డబ్బా పాలు పట్టించి పడుకోబెట్టారు. మధ్యాహ్నం వరకు పిల్లల్లో ఉలుకు పలుకు లేదు. ముక్కుల్లో నుంచి పాలు బయటకు వచ్చి విగతజీవిగా కనిపించారు. దీంతో కంగారు పడ్డ తల్లి పిల్లలను లేపేందుకు ప్రయత్నించింది. చివరికి బోరున విలపిస్తూ జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే డబ్బా పాలు పట్టించడం వల్లనే పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కవలలకు నాలుగు నెలలకే నూరేళ్ళు నిండిపోయాయి. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..