L Ramana joins in TRS Party: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గులాబీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ గూటికి చేరారు. ఇటీవలే తెలుగు దేశం పార్టీకి రాజీనామా సమర్పించిన రమణ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ దళంలో చేరిపోయారు.
టీఆర్ఎస్ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో రమణకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. చేనేత వర్గంలో నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతం కోసం నిబద్ధతతో ఎల్.రమణ పనిచేస్తారని, ఆయనతో సహా పార్టీలో చేరిన నేతలకు మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేతల బాధ్యత ఎల్.రమణకు అప్పగిస్తామన్నారు. రైతు బీమాలా చేనేతలకు కూడా బీమా వర్తింప చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని.. దీన్ని త్వరలో అమలు చేస్తామన్నారు.
దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టామని, స్వరాష్ట్రంలో పథకం ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, చాలా క్లారిటీగా ఎజెండాతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.