AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరాకు ఊరెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC

హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది. 

దసరాకు ఊరెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC
TSRTC
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2023 | 6:09 PM

Share

దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి.

హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది.  అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి.

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి.  మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి.

“బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులన్ని నడుస్తాయి. గత దసరాకు 4280 ప్రత్యేక నడపగా.. అందులో 239 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించాం.  గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం)  బస్సులను అదనంగా నడుపుతున్నాం. ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను కూడా 535కి పెంచాం. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే సంస్థ వసూలు చేస్తుంది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థైన టీఎస్ఆర్టీసీ కోరుతోంది.” అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.

ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.inలో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం