
కేసీఆర్ ప్రభుత్వం తెస్తున్న అప్పులపై సీఏల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఆర్ బీఎమ్(FRBM) ను 3 నుంచి 5 శాతంకు పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేందుకు కేసీఆర్ మార్గం సుగమం చేసుకున్నారని విమర్శించారు. ఈ చర్యల వల్ల 55 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అప్పు తీసుకునేందుకు వెసులుబాటు కలిపించుకుందని చెప్పారు. అంతేకాకుండా కార్పోరేషన్ల లోన్లు రెండు వందల శాతం పెంచుకున్నారని వెల్లడించారు. 2023 నాటికి 5 లక్షల 80 వేల కోట్ల అప్పు చేసుకునేందుకు చట్టం తెచ్చారని భట్టి వ్యాఖ్యానించారు. ‘3 లక్షల కోట్ల అప్పుకు 23 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం.. అదే 6 లక్షల కోట్ల అప్పుయితే సంవంత్సరానికి 50 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది.. భవిష్యత్ ప్రభుత్వ ఆదాయం మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది’ అని ఆయన అన్నారు. ఎఫ్ ఆర్ బీ ఎమ్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా భట్టి ప్రకటించారు.