Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షాలు.. వరదగుప్పిట్లో పలు కాలనీలు.. నదులను తలపిస్తున్న రోడ్లు

|

Jul 30, 2022 | 6:54 AM

మహానగరం మునిగింది. ఉదయం నుంచి ఎండ.. మధ్యాహ్నానికి మారిన వాతావరణం సాయంత్రం భారీ వర్షం. ఇలా ఒక్కరోజులో

Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షాలు.. వరదగుప్పిట్లో పలు కాలనీలు.. నదులను తలపిస్తున్న రోడ్లు
Hyderabad Rains
Follow us on

Hyderabad Rains: హైదరాబాద్ లో భిన్న వాతావరణం నెలకొంది. అప్పటి వరకూ ఎండలు అంతలోనే వర్షం ఇదీ భాగ్యనగరంలో తాజాగా పరిస్థితి. చినుకు చినుకుగా మొదలై..  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షపునీరు కాలనీలను ముంచెత్తాయి. ఓ రెండు గంటలపాటు ఆకాశానికి చిల్లుపడినట్లు దంచిన వానతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులకు.. మళ్లీ వర్షం వణుకుపుట్టించింది. గంటలోనే 4 నుంచి 5 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో లోతట్టుప్రాంతాల్లో భారీగా నీరు చేరింది.

జీడిమెట్ల, బాలానగర్‌, అపురూపకాలనీ, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, సూరారం, మియాపూర్‌, శేరిలింగంపల్లిలో జోరు వాన కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్‌, బాచుపల్లిలోనూ అవే సీన్లు కనిపించాయి. అమీర్‌పేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి ఇలా ఎక్కడ చూసినా వానలు, వరదలే. హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, అచ్యుత్‌రెడ్డి మార్గ్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, కవాడిగూడ, బోలక్‌ పూర్‌, గాంధీనగర్‌, రాంనగర్‌, దోమలగూడ ప్రాంతాల్లోనూ వానలు దంచికొట్టాయి. ఉప్పల్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

యూసఫ్​గూడలో రిపేర్​షాప్​లోని వాషింగ్​ మిషన్​ నీటిలో కొట్టుకుపోయింది. దానిని ఆపడానికి యువకుడు ఎంతో ప్రయత్నించాడు. కానీ నీటి ఉద్ధృతికి అది కొట్టుకుపోయింది. ఇలా భారీ వర్షానికి చాలా మంది వస్తువులు నీటిపాలయ్యాయి. ఇక దమ్మాయిగూడలో సాయంత్రం కురిసిన వానతో మోకాల్లోతు నీరు వచ్చి చేరింది. దీంతో జేసీబీతో స్థానికులు రోడ్డు క్రాస్‌ చేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా నేరేడ్ మెట్ లో 9.5 సెంటీమీటర్లు, ఆనంద్ బాగ్ లో 7.3 సెంటీమీటర్లు, మల్కాజిగిరిలో 6.7, తిరుమలగిరిలో 6.3, హయత్ నగర్ లో 6.3, ఏ ఎస్ రావు నగర్ లో 6.1, చర్లపల్లిలో 5.9, అల్వాల్ లో 5.8, ఫతే నగర్ లో 5.5 వెస్ట్ మారేడ్ పల్లిలో 5.3, బేగంపేట్ లో 5, మోండామార్కెట్ లో 4.7, సీతాఫల్ మండిలో 4.6, ఎల్బీనగర్ లో 4.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. నగరమంతటా సరాసరి 5 సెంటిమీటర్ల వర్షం పడింది.

సాయంత్రం వివిధ పనులపై బయటకు వెళ్లిన వారు వర్షానికి తడిసి ముద్దయ్యారు. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో.. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. పంజాగుట్ట, ఖైరతాబాద్‌ చౌరస్తాలో వాహనాలు ఆగిపోయాయి. ప్రధాన జంక్షన్లు అన్ని జామ్ అయ్యాయి. దీంతో 10 నిమిషాల ప్రయాణం గంటకుపైగా పట్టింది. మరోవైపు మ్యాన్‌హోల్స్‌ తెరవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..