తెలంగాణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. అధికార పార్టీకి చెందిన అభ్యర్ధులే ఎక్కువ మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్ ఎన్నికల ఏకగ్రీవంలో గెలుపొందిన వారి వివరాలను సహకార శాఖ ప్రకటించింది.
ఉమ్మడి జిల్లాల ప్రకారం 9 DCCB, 9 DCMSలున్నాయి. ఒక్కో బ్యాంకులో 20, సొసైటీలో 10 చొప్పున డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 180 స్థానాలకు గాను 147 మంది, సొసైటీల్లో 90కి గాను 74 మంది ఏకగ్రీవం అయ్యారు. ఈనెల 29న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. కేవలం నల్లగొండ జిల్లాలో మాత్రం ఒకేఒక్క డైరెక్టర్ స్థానం కాంగ్రెస్‌పార్టీకి దక్కింది.
అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్ డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే 9 డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్ పదవులకు 16 నామినేషన్లు దాఖలు కాలేదు. ఇదిలావుండగా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది.
సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటడంపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వారి గెలుపుకు కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలను ఆయన అభినందించారు. ఛైర్మన్, ఉపాధ్యక్ష అభ్యర్ధుల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌దే తుది నిర్ణయం కానుంది. 29న జరిగే ఎన్నికలకు గంట ముందు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తారు. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి.