TRS MLAs Fire on TPCC Chief Revanth Reddy: పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణరెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాలకు ఇతరును నిందిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి.. పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒంటి కాలితో లేస్తున్నారు. మీరు రాళ్లతో కొడితే, మేం చెప్పులతో కొడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్‌లో వీలినం చేశామని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. మావి సేవా రాజకీయాలు, నీది స్వార్థ రాజకీయాలు అంటూ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావ్ అంటూ ఆరోపించారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగ తమ గురించి మాట్లాడటం ఏమిటంటూ సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. ఓటుకు పీసీసీ పదవులు, ఎమ్మెల్యేల సీట్లను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల మొత్తం వివాదాస్పదమేనని, రాళ్లతో కొట్టి చంపండి అనేది రాజ్యాంగంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీలు మారితే సంసారం, కానీ ఇక్కడ మారితే వ్యభిచారమా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజాంగ్యం ప్రకారమే తాము టీఆర్ఎస్‌లో విలీనమయ్యామని వెంకటరమణారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి నిషేధిత సంస్థల భాష మాట్లాడుతున్నారు.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసులు పెడతామన్నారు గండ్ర.
అటు, రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బాల్క సుమన్. ఓటుకు నోటు కేసులో రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిని ఏం చేయాలో కూడా చెప్పాలని రేవంత్‌కు సూచించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ ని ఏం చేయాలి? అని బాల్క ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు రేవంత్ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also…. పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తల ఆందోళన..వాటర్ క్యానన్లను ప్రయోగించిన పోలీసులు