అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక సంఘటన మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!
Student Swim Death

Edited By:

Updated on: May 14, 2026 | 11:09 PM

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక సంఘటన మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పులిపలుపుల గ్రామానికి చెందిన కాగిత లక్ష్మణ్ రెండో కుమారుడు కాగిత అఖిల్ (14). అఖిల్ సమీపంలోని గూడపూర్ గ్రామంలో గల శాంతినికేతన్ పాఠశాలలో ఇటీవలే ఏడవ తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అఖిల్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం (మే 14) మధ్యాహ్నం గ్రామంలోని తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు.

స్నేహితులందరూ కలిసి ఉత్సాహంగా నీటిలోకి దిగారు. అయితే, చెరువులో ఈత కొడుతున్న సమయంలో అఖిల్ ప్రమాదవశాత్తు కాలు జారి లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. నీటిలో మునిగిపోతున్న అఖిల్ ఒక్కసారిగా కేకలు వేయడంతో తోటి స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు అఖిల్‌ను కాపాడేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. లోతు ఎక్కువగా ఉండటంతో బాలుడు నీటిలో మునిగిపోయాడు.

దీంతో భయాందోళనకు గురైన స్నేహితులు వెంటనే గట్టుపైకి వచ్చి, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు ఒక గంట పాటు నీటి గుంటలో వెతికిన తర్వాత అఖిల్ మృతదేహం బయట పడింది.

బాలుడు నీటిలో దాదాపు గంట సేపు మునిగిపోవడంతో, ఊపిరి ఆడక, భారీగా నీరు కడుపులోకి వెళ్లడం వల్ల అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. కళ్ల ముందే ఆడుకుంటూ వెళ్లిన కొడుకు శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో పులిపలుపుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మునుగోడు తహశీల్దార్ నరేష్, సబ్ ఇన్‌స్పెక్టర్ రవి తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకుని తాము ప్రాథమిక పరిశీలన చేశామని, అయితే ఇప్పటివరకు మృతుడి కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని మునుగోడు ఎస్ఐ రవి తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us