
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును(Cm Kcr)ను దుశ్శాసనుడు, దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉందని ఎద్దేవ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) . నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయాన్ని చూస్తే అలానే అనిపించిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చెప్పింది నిజమే.. మోడీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పే ఉంది కానీ మోడీకు గురువు కేసీఆర్. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్నాథ్ షిండేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్ కదా? ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‌ను టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్ కాదా? ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్ నాథ్ షిండేలను తయారు చేసింది కేసీఆర్ కాదా? ఇప్పుడు ఏక్ నాథ్ షిండే భూతం కేసీఆర్‌ను పట్టుకుందా అంటూ ప్రశ్నించారు.
టీఆర్ఎస్లో ఉన్న వారంతా ఇతర పార్టీ నేతలే. ఏక్ నాథ్ షిండేకు కేసీఆర్ గాడ్ ఫాదర్. వంద ఎలుకలు తిన్న పిల్లి నీతి వాఖ్యలు చెప్పినట్లు.. సీఎం కేసీఆర్ వంద తప్పులు చేసి ఇప్పుడు నీతి వాఖ్యలు వల్లిస్తున్నారని విమర్శించారు. ఈ దేశంలో సాగు ,తాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ కాదా? బీజేపీ తప్పిదాల్లో టీఆర్ఎస్ పాత్ర ఉందన్నారు.
నాలుగురోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రావాలి..
ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్‌ను స్వీకరించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాలుగురోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రావాలని.. డెడ్‌లైన్ పెట్టారు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో 90లక్షల ఓట్లు సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు రేవంత్. అలా చేయని పక్షంలో తాను పేరు మార్చుకుంటానని ప్రతిసవాల్ విసిరారు.