Chalo Raj Bhavan – Revanth Reddy: ‘తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్న.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తాం.’ అని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పిలుపు మేరకు చేస్తున్న ఈ కార్యక్రమం నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ధర్నా చౌక్ దగ్గర్నుంచి రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించాలని ఆయన కోరారు.
“మా సంయమనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించవద్దు. ముందస్తు అరెస్టులు నిర్బంధాలు చేస్తే చూస్తూ ఊరుకోం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. గృహ నిర్బంధం చేసిన వారిని వదిలిపెట్టాలి” అని రేవంత్ డిమాండ్ చేశారు. 40 రూపాయలు పెట్రోల్ ను 105 రూపాయలకు విక్రయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని రేవంత్ ఈ సందర్భంగా ఆరోపించారు. కొంచెం సేపటి క్రితం ‘చలో రాజ్ భవన్’ నిరసనపై ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపేందుకు ఈ దేశ పౌరులుగా మాకు హక్కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే లక్షలాదిమంది కార్యకర్తలు రోడ్డుపైకి వస్తారని రేవంత్ హెచ్చరించారు. పోలీసులు తమ విచక్షణ మేరకు అధికారాలు మేరకు విధులు నిర్వహించాలని, పోలీసులు ఎంత మందిని అరెస్టు చేసినా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి.