పెద్దపల్లి, ఆగస్టు 27: కరోనా పుణ్యమా అని.. అప్పటి నుంచి నిత్యవసరాల ధరలు ఆకాశాన తిష్టవేశాయి. కూరగాయల నుంచి సరుకుల వరకు ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ మహానుభావుతు ఉచితంగా కూరగాయలు పంచాడు. ఇక ఈ విషయం తెలుకున్న జనం ఊరుకుంటారా.. సంచులు ఎత్తుకొచ్చి ఎగబడి మరీ టన్నుల కొద్దీ కూరగాయలు ఉచితంగా తీసుకెళ్లారు. ఎక్కడో అనుకుంటే పొరబాటే.. సాక్షాత్తు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం (ఆగస్టు 27) ఉదయం ఈ పంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
పెద్దపల్లి జిల్లాలో గత కొద్ది రోజులుగా కూరగాయల మార్కెట్లో హోల్‌సేల్, రిటైల్ కూరగాయలు వ్యాపారస్తుల మధ్య వివాదం నెలకొంది. హోల్‌సేల్ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్‌గా అమ్మడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రిటైల్ చిన్నా, చితర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక రిటైల్ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్ బంద్ చేసి వినియోగదారులకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఉచిత కూరగాయల పంపిణీ గురించి తెలుసుకున్న స్థానికులు.. మార్కెట్‌కు చేరుకుని బస్తాల నిండా కూరగాయలు తీసుకెళ్లారు. దీంతో కూరగాయల కోసం జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య ఏర్పడిన విభేదాలే కూరగాయల ఉచిత పంపిణీకి ప్రధాన కారణమని పేర్కొన్నారు. హోల్‌సేల్ వ్యాపారులు ఒప్పందాన్ని ఉల్లంఘించి రిటైల్‌లో విక్రయించడం ప్రారంభించడంతో ఇరువురు వ్యాపారుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. వీరి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిల్లర వ్యాపారులు నిరసనకు దిగారు. దీంతో వారు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసి నిరసన తెలిపారు.