
పండుగ పూట ఆ తల్లిదండ్రులకు తీరని దు:ఖం. ఆ పాపాయికి మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. నిజంగా ఇంత కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఈ విషాద ఘటన వైరాలో చోటుచేసుకుంది. నెలరోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది చిన్నారి. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో పొయ్యి మీద కాగుతున్న సాంబారు గిన్నెలో ప్రమాదవశాత్తు జారిపడి రమ్యశ్రీ అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇందిరమ్మ కాలనీకి చెందిన మునగాల సింహాద్రి, సరోజని దంపతులు పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. గత డిసెంబర్ 18న తమ ఇంట్లో ఏసుక్రీస్తు ప్రార్థన, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వారి మూడేళ్ల కుమార్తె రమ్యశ్రీ తమ ఇంటి మెట్లపై ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తూ జారి కిందనే ఉన్న పొయ్యి మీద కాగుతున్న వేడివేడి సాంబారు గిన్నెలో పడింది. ఇంట్లో ఉన్న వారు గమనించేలోపే..శరీరం మొత్తం కాలి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే చిన్నారిని హైదరాబాద్ నీనీలోఫర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద సాయలు అలుముకున్నాయి. ఇంట్లో ఆడుతూ గెంతులేస్తూ ఉండే చిన్నారి ఇలా మృతి చెందడం స్థానికులను కన్నీళ్లు పెట్టించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.