Telangana: హోటల్‌లో దొంగతనానికి వచ్చిన దొంగలు.. కిచెన్‌లో మసాలా ప్యాకెట్లు చూడగా..

దొంగతనం అంటే నగదు, నగలు చోరీ చేస్తుంటారు. లేదా ఏదయినా విలువైన వస్తువులు దొంగతనం చేస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం సితార అనే రెస్టారెంట్‌లో చోరీ జరిగింది. క్యాష్ కౌంటర్‌లో 40 వేల నగదు చోరి జరిగితే.. కిచెన్‌లో ఉన్న మసాల దినుసులు, అల్లం, వెల్లుల్లి, దొంగతనం చేశారు.

Telangana: హోటల్‌లో దొంగతనానికి వచ్చిన దొంగలు.. కిచెన్‌లో మసాలా ప్యాకెట్లు చూడగా..
Representative Image

Edited By:

Updated on: Mar 16, 2025 | 8:40 PM

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది కొందరి దొంగల తీరు. దొంగతనాలను చాకచక్యంగా చేయడమే కాకుండా టెక్నాలజీ పరంగా కూడా నాలెడ్జ్ పెంచుకొని చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. అందుకు ఉదాహరణ ఈ ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సితార అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు నగేష్ అనే వ్యక్తి. నిన్న రాత్రి పని ముగించుకుని యధావిధిగా హోటల్‌కి లాక్ చేసి వెళ్లిపోయిన నగేష్ ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి హోటల్‌లో దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. హోటల్ పరిసరాలను నిశితంగా పరిశీలించగా చోరీకి పాల్పడినవారు చాలా తెలివిగా వ్యవహరించారు అనే విషయం బయటపడింది.

హోటల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లను కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. చోరీ అంటే సాధారణంగా డబ్బులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు దొంగలు. కానీ ఇక్కడ మాత్రం గల్లా పెట్టెలో ఉన్న నగదుతో వంటకు ఉపయోగించే మసాల దినుసులు, అల్లం, వెల్లుల్లి ఎత్తుకుపోయారు. సుమారు వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని అలాగే కౌంటర్‌లో ఉన్న 40 వేల నగదును దొంగలెత్తుకుపోయారని యజమాని నగేష్ చెప్తున్నాడు. ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దొంగతనాలకు పాల్పడేవారు సీసీ కెమెరాలకు చిక్కకుండా వంటకు ఉపయోగించే మసాలాలు కూడా ఎత్తుకుపోవడం చూస్తే మసాలాలతో దొంగలకు ఏమి పని.. ఇదేమి దొంగతనం అన్నట్లు.. దొంగతనానికి కాదేది అనర్హం అనట్లుగా తయారైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.