Kishan Reddy: తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వ వినతులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ‘మేమివ్వాలనుకున్నవే మేమిస్తాం.. వాళ్లు అడిగినవి మేము ఇవ్వం.’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సహా అనేక అంశాలపై స్పందించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రూల్డ్ అవుట్ అయ్యిందని అన్నారు. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెడితే నష్టాలే తప్ప లాభాలు ఉండవని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా వస్తుంది?
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అనేకసార్లు అడిగామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా వస్తుంది? అని అన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం కట్టుకున్న ప్రాజెక్టు అని అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉంది కాబట్టి తామే నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. రైతులకు లాభం జరుగుతుందని దేశంలోని 11 ప్రాజెక్టులకు నిధులు ఇచ్చామని అన్నారు. ఏయిమ్స్ మెడికల్ కళాశాల మంజూరు చేస్తే అధికారికంగా ఇప్పటి వరకు భవనాలు అప్పగించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
భూములు ఇవ్వడం లేదు..
తెలంగాణకు కేంద్రం చాలా కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సైనిక్ స్కూల్ మంజూరు చేసినా స్థలం కేటాయించలేదని ఆరోపించారు. సైన్స్ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ స్థలాలను వెతుకుతున్నామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తి చేశామని, రైల్వే లైన్లు వేసి సిద్దం చేశామని, బోగీలు మాత్రమే కొనాల్సి ఉందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడంతో అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తాము నిర్మించిందే అని చెప్పారు కిషన్ రెడ్డి.
చాలా మంది పిల్లలకు నష్టం..
కరోనాతో ఎంతమంది చనిపోయారో నిర్ధారించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందన్నారు. వారిచ్చిన లెక్కలనే తాము ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా మంది పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి అర్హత కోల్పోయారని కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల వల్ల తెలంగాణ, ఏపీలో శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఓడిపోయినా మంచిదే కాని ఉచితపథకాలు పెట్టకూడదనుకున్నామని చెప్పారు. తాము తీసుకున్న చర్యల వల్ల నేడు దేశంలో విదేశీ నిల్వలు పెరిగాయని, దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందన్నారు.