
Telangana News: రాష్ట్రంలోని పేదలందరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కొత్త ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఆర్ధిక సహాయం అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయగా.. కొన్ని పూర్తై గృహాప్రవేశం కూడా పూర్తయ్యాయి. దశవారీగా వీటిని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఇల్లు మంజూరు చేస్తోండగా.. త్వరలో పట్టణాలు, నగరాల్లో ఉన్న ప్రజలకు కూడా అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇల్లు మంజూరు చేసేందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ మార్గదర్శకాలను పాటించనివారిని అనర్హులుగా గుర్తించి మంజూరైన ఇళ్లను రద్దు చేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులుగా గుర్తించిన 2,500 మందికి నిధులను నిలిపివేసింది. సొంత కారు, గతంలో ఇంటికి ప్రభుత్వం నుంచి సాయం పొందినవారు ఈ పథకానికి అనర్హులు. కానీ ఇలాంటివారు కొంతమంది కూడా ఇందిరమ్మ ఇళ్లు పొందారు. దీంతో వీరిని గుర్తించి ఇళ్లను రద్దు చేయడంతో పాటు నిధులను నిలిపివేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అన్నీ పరిశీలిస్తోంది. ఇల్లు నిర్మించుకునే సమయంలో మధ్యలో అనర్హులు అని తేలితే నిధులు జమ చేయకుండా నిలిపివేస్తోంది.
ఇటీవల ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఓ ఎస్టీ లబ్దిదారుడికి ఇల్లు మంజూరై పునాదుల వరకు వెళ్లింది. కానీ ఇతడికి ఫోర్ వీలర్ ఉందని అధికారుల సర్వేలో తేలడంతో అతడికి నిధులను ఆపేశారు. ఇక వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తికి గతంలోనే ప్రభుత్వం నుంచి ఇంటి కోసం సాయం పొందినట్లు తేలింది. దీంతో అతడికి కూడా నిధులు మధ్యలో ఆపేశారు. ఇలా అధికారుల సర్వేలో దాదాపు రాష్ట్రంలో 2,500 మంది అనర్హులుగా తేలింది. వీరందరికీ నిధులు కట్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 3.48 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఇందుకోసం రూ.3,800 కోట్లను లబ్దిదారుల అకౌంట్లలో జమ చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రస్తుతానికి కేటాయించారు. గ్రామాల్లో ఐదుగురు సభ్యులతో కూడిన ఇందిరమ్మ కమిటీలను నియమించారు. వీళ్లు ఎంపిక చేసినవారికి ఇళ్లను మంజూరు చేస్తున్నారు.