ఉమ్మడి ఆదిలాబాద్ అదికార పార్టీ నేతలను వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో తృటిలో పెను ప్రమాదాల నుంచి బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. జరిగిన ప్రమాదాలు పెద్దవే అయినా అదృష్టవశాత్తు బయటపడటంతో పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. రెండు వారాల వ్యవదిలో ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రోడ్డుప్రమాదాలకు గురి కావడం తృటిలో ప్రాణాలతో బయటపడటంతో ఆ ఎమ్మెల్యేలకు గండం గట్టెక్కినట్టే అన్న చర్చ సాగుతోంది.
జూన్ 15 న మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బయలు దేరిన ఎమ్మెల్యే లు జోగురామన్న , కోనేరు కోనప్ప ల కారు యావత్మాల్ జిల్లా పాండ్రకోడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. సడన్ గా పశువుల మంద అడ్డురావడంతో కంట్రోల్ కోల్పోయిన ఎమ్మెల్యే వాహన డ్రైవర్ ఓ పశువును ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న , సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తో పాటు.. మాజీ ఎంపి నగేష్ ప్రమాదం నుండి బయటపడ్డారు.
ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజులకు సరిగ్గా అదే తీరున బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వాహనం ప్రమాదానికి గురవడం బీఆర్ఎస్ కార్యకర్తలను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జవగా… ఎమ్మెల్యే ఎడమ చేతి వేళ్లు ప్రమాదంలో విరిగిపోయాయి. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ బెలున్స్ ఓపెన్ అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు రాథోడ్ బాపురావు. హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిర్మల్ బైపాస్ సమీపంలోని నేరడిగొండ మండలం కొరటికల్ వద్ద ఒక్కసారిగా ఆవు అడ్డు రావటంతో.. ప్రమాదం జరిగింది.
ఉమ్మడి ఆదిలాబాద్ లోని ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యే లను రెండు వారాల వ్యవదిలోనే వరుస ప్రమాదాలు పలకరించడంతో నేతల అభిమానుల్లో కలవరం మొదలైంది. ప్రమాదాల నుండి తృటిలో బయటపడటంతో పెను గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకుంటున్నారు అభిమానులు. అయితే ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఒకే రకమైన ప్రమాదానికి గురవడం ఇటు పార్టీలో అటు ప్రజల్లో చర్చకు దారి తీసింది. రాబోయే ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో మరోసారి ప్రజా క్షేత్రంలో నిలిచేందుకు దండిగా నూకలున్నాయని.. ఓటర్ ఆశీర్వాదం మరింత మెండుగా ఉంటే మరోసారి గెలిచి నిలుస్తారని.. పెనుగండాలు తప్పినట్టేనని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. మొత్తానికి దేవుని దయ వల్ల రోడ్డు ప్రమాద గండాలుండైతే గట్టెక్కాయి కానీ రాబోయే ఎన్నికల్లో ఓట్ల గండం నుండి ఎలా బయటపడుతారో చూడాలి అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..