ఆపరేషన్ గంజాయిపై సీరియస్‌గా ఫోకస్ చేసింది తెలంగాణ సర్కార్. వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టాలని నిర్ణయించిన సర్కార్.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడుకుని గంజాయి ముఠా గుట్టురట్టు చేస్తున్నారు. గంజాయి అమ్మకాలకు చెక్ పెడుతున్న పోలీసులు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసలు బండారం బయటపెట్టారు.
మణుగూరు లో గంజాయి అమ్మే ప్రాంతాలలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఏకంగా భూమిలో పాతిపెట్టిన గంజాయిని వెలికి తీసింది డాగ్ స్క్వాడ్. రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇంటి యజమాని అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో గంజాయి నియంత్రణలో పోలీసులు దూకుడు పెంచారు. చిన్న చిన్న పట్టణాల నుండి మెట్రోపాలిటన్ నగరాల వరకు గల్లీ గల్లీలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు బానిసలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి అమ్మకాలను అరికట్టేందుకు పోలీసు అధికారులు కొత్త ప్రణాళిక రూపొందించారు. గంజాయి అమ్మకాలను పసిగట్టేందుకు నార్కోటిక్ డాగ్స్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం (ఆగస్ట్ 4) మణుగూరులో నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మే ప్రాంతాలలో డాగ్‌ను తీసుకెళ్లగా, ఓ ఇంటి పెరటిలో భూమిలో పాతిపెట్టిన గంజాయిని వెలికి తీసింది నాకోటిక్ డాగ్. దీంతో పోలీసులు ఆ ఇంటి యజమాని గురవయ్యను అదుపులోకి తీసుకుని రెండు కేజీల గంజాయి, రెండు లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణుగూరులో గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, గంజాయి అమ్మకాలు ఎవరు జరిపిన కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..