Telangana: నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. కామాంధులకు ఏ శిక్ష విధించిందంటే..?

దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కీచకుల కామానికి చిన్నారులు బలవుతున్నారు. చిన్నారులను చిదిమేసిన నిందితులకు కోర్టు కఠిన శిక్ష వేసింది. నల్గొండ జిల్లాలో జరిగిన రెండు ఘటనల్లో ఒకరికి 22 ఏళ్లు, మరో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Telangana: నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. కామాంధులకు ఏ శిక్ష విధించిందంటే..?
Nalgonda POCSO Court

Edited By:

Updated on: Sep 04, 2025 | 7:19 PM

కామాంధులకు కోర్టు కఠిన శిక్ష విధించింది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులకు భారీ జైలు శిక్షలతో పాటు జరిమానాలు విధించింది. ఈ తీర్పుల ద్వారా బాధితులకు న్యాయం జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష

2018లో చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా అనారోగ్యంతో ఇంటి వద్ద ఉన్న 11 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన తిప్పర్తి యాదయ్య కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. జిల్లా పోక్సో కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నిందితుడు తిప్పర్తి యాదయ్యకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.35,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

మరో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

మరో కేసులో దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన భాస్కరాచారి అనే వ్యక్తి టీవీ చూద్దామని ఇంట్లోకి తీసుకువెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు 2018 మార్చిలో నిందితుడు భాస్కరాచారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండేళ్లుగా విచారణ కొనసాగింది. ఈ కేసులో కూడా ప్రాసిక్యూషన్ తరపున వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. నిందితుడు భాస్కరాచారికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు. ఈ రెండు కేసుల్లోనూ సరైన వాదనలు, పోలీసుల సమగ్ర దర్యాప్తు కారణంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.