
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఎట్టకేలకు పర్యావరణ అనుమతి లభించింది. పర్యావరణ అనుమతులను సిఫారసు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చివరి దశకు చేరుకున్న ప్లాంట్ పనులతో విద్యుత్ ఉత్పత్తి దిశగా అధికారులు అడుగులు వేసే అవకాశం ఉంది.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ ప్లాంట్ (YTPS) నిర్మాణాన్ని చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు అదనంగా కావడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ.34,500 కోట్లకు పెరిగింది. తాజాగా పవర్ ప్లాంట్ అంచనా వ్యయం రూ.50 వేల కోట్లకు చేరింది.
యాదాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలో జరిగాయని రెండు స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్జీటి యాదాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ నిర్మాణానికి పర్యావరణ అనుమతులను నిలిపివేసింది. పర్యావరణ అనుమతి కోసం తిరిగి టర్మ్ అండ్ రిఫరెన్స్(TAR) జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అనుమతులు వచ్చేవరకు ప్లాంట్ నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ప్లాంట్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర అధికారులు గత ఏడాది నవంబర్ 8న మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనను కేంద్రానికి పంపారు.
ప్రతిపాదనలను పరిశీలించిన నిపుణుల మదింపు కమిటీ ప్లాంటు రెండో దశ నిర్మాణానికి అనుమతులను సిఫార్సులను చేసింది. కొన్ని షరతులతో కూడిన అనుమతిని పర్యావరణ శాఖ మంజూరు చేసింది. పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అనుమతులు సూచించింది. ముఖ్యంగా ప్లాంట్ పరిసరాల్లో మూడు వరుసల్లో మొక్కలు 2024 జూన్ నాటికి నాటాలని ఆదేశించింది. సామాజిక బాధ్యత కింద పనులు చేపట్టేందుకు వంద కోట్లును కేటాయించాలని సూచించింది. థర్మల్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను వంద శాతం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అనుమతుల్లో పేర్కొంది. ప్లాంట్ కు 10 కిలోమీటర్ల లోపు ఉండే స్థానికుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉచిత వైద్య సేవలు అందించాలని ఆదేశించింది.
ప్లాంట్ పై ప్రభుత్వ విచారణ…
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ ప్లాంట్ నిర్మాణంపై విచారణకు ఆదేశించింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలపై జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…