రాజన్న సిరిసిల్ల, జనవరి 17: వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పాలిస్టర్ వస్ర నిల్వలు నానాటికీ పేరుకుపోతున్నాయి! సరయినా మార్కెట్ లేకపోవడంతో నిల్వలు ఎక్కడిక్కడే పెరిగిపోతున్నాయి. దీంతో గత్యంతరంలేక వస్త్ర కార్మికులు సమ్మెకు దిగారు. సిరిసిల్లలో వినిపించే మగ్గం చప్పుడు ఇప్పుడు వినిపించడం లేదు. 30 వేల మరమగ్గాలు బంద్ కావడంతో వాటినే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న 20 వేలమంది కార్మికుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇవ్వాల్సిన రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఆర్డర్లపై స్పష్టత లేకపోవడం, బతుకమ్మ చీరలకు సంబంధించి రూ. 200 కోట్ల బిల్లులు విడుదల చేయకపోవడంతోపాటు బతుకమ్మ చీరల కొత్త ఆర్డర్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ లేకపోవడం నేతన్నలను కలవరపాటుకు గురిచేస్తుంది.
వీటన్నింటికీ తోడు దాదాపు రూ.35 కోట్ల విలువైన పాలిస్టర్ వస్త్ర నిల్వలు పేరుకుపోవడం వారిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. బకాయిలతో పాటు కొత్త ఆర్డర్స్ రాకపోవడంతో పరిశ్రమపై ప్రభావం చూపింది. పాలిస్టర్ వస్ర్తాలకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది. కష్ట పడి పని చేస్తే పాలిష్టర్‌కి బహిరంగ మార్కెట్‌లో సరైన ధర లేదు. అదేవిదంగా.. చీరల కోసం ప్రభుత్వం ఇచ్చే దాదాపు రూ. 350 కోట్ల విలువైన ఆర్డర్లపైనా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. వెంటనే.. బతుకమ్మ చీరలకు ఆర్డర్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు రూ.35 కోట్ల విలువైన వస్ర్తాలు నిల్వ ఉన్నాయి.
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి రూ.250 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని నేతన్నలు కోరుతున్నారు. మూడు రోజుల నుంచి పవర్ లుమ్స్ బంద్ కొనసాగుతుందని కార్మికులు అంటున్నారు. ఇది తమ ఉపాధిపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమ్మె విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు పాత బకాయిలతో పాటు కొత్త ఆర్డర్స్ ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు. పాలిష్టర్ బట్ట పెరుకుపోయిందని చెబుతాన్నారు. నష్టాల్లో ఉన్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.