Friendship: కష్ట సుఖాల్లో తోడు నిలిచే మంచి స్నేహితుడు ఉన్నవాడు.. ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు అన్న మాట అక్షర సత్యం.. అవును ఓ సినీ కవి అన్నట్లు స్నేహానికి కన్న మిన్న లోకాన ఏదీ లేదు.. ఈ విషయాన్ని అనేక సార్లు.. అనేక సందర్భాల్లో రుజువు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. స్నేహితుడు కష్టాల్లో ఉంటే ఆర్ధికంగా అడ్డుకొన్నవారు.. స్నేహితుడు మరణిస్తే ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచినవారు, ఇలా అనేక వార్తలను వింటూనే ఉన్నాం.. తాజాగా తమ స్నేహితుడు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న విషయాన్నీ కొంతమంది స్నేహితులు గమనించారు. తమ స్నేహితుడి కష్టాన్ని ఎలాగైనా తీర్చాలని భావించారు. ఒక్కరుగా చేయలేని పనిని .. చేయి చేయి కలిసి.. కొందరుగా మారి… తలా కొంచెం డబ్బులు పోగుచేసి.. ఒక ఇంటికి కట్టించి తమ స్నేహితుడికి గిఫ్ట్ గా ఇచ్చారు. స్నేహం అంటే.. కబుర్లు కాలక్షేపానికి కాదు.. ఆపదలో ఆదుకోవడం.. కష్టంలో ఇష్టంగా తోడు ఉండడం స్నేహం అంటూ స్నేహం విలువను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని చించోడ్ గ్రామానికి చెందిన 1993-94 విద్యా సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు ఇటీవల రీ యూనిట్ అయ్యారు. అప్పుడు టెన్త్ చదివిన వారందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నారు. ఆ కార్యక్రమంలో స్నేహితులందరూ ఒకరికొకరు తమ బాధలు, సంతోషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ స్నేహితుడు శ్రీనివాసాచారి ఆర్ధికంగా చాలా కష్టాల్లో ఉన్నాడని.. కనీసం ఉండడానికి కూడా సరైన వసతి లేదని తెలుసుకున్నారు. శ్రీనివాసాచారి ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఇక కనీసం బాత్రూం సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్నారు.
తమ స్నేహితుడి దీనస్థితికి మిత్రులు చలించిపోయారు. శ్రీనివాసచారిని ఆదుకోవాలని టెన్త్ స్నేహితులు భావించారు. వెంటనే వారంతా తలా కొంచెం డబ్బులు వేసుకుని ఇంటిని బాగు చేయించారు. ఇటీవలే ఆ ఇంట్లోకి శ్రీనివాసాచారి స్నేహితుల సమక్షంలో గృహ ప్రవేశం చేశాడు. ఈ సందర్భంగా అందరూ తమ స్నేహితుల్లో ఎవరైనా కష్టంలో ఉన్నా.. అర్ధంకంగా ఇబ్బందులు పడుతున్నా ఆదుకోవాలని.. అవసరమైన సమయంలో అండగా నిలబడాలని నిశ్చయించుకున్నామని వారు చెప్పారు.
Also Read: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో రజతం సాధించిన సుహాస్.. 18 కి చేరిన భారత్ పతకాల సంఖ్య