Cold Waves in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లోని, తెలంగాణ(Telangana)లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది, దీనికి తోడు దట్టంగా మంచుకురుస్తోంది. దీంతో తెలుగురాష్ట్రల్లోని ప్రజలు చలికి గజగజవణుకుతున్నారు. చాలా ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకోవడంతో తెల్లవారినా జనం ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. దట్టమైన పొగమంచు కప్పేయడంతో రహదారులకు కనిపించడం లేదు. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణాలోని ఆదిలాబాద్ , మంచిర్యాల, హైదరాబాద్ నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి నగరంలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.
హైదరాబాద్ నగర పరిధిలో మళ్ళీ చలి తీవ్రత ఓ రేంజ్ లో పెరిగింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి పొడి వాతావరణం నెలకొంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో అత్యల్పంగా 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజులు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళ నగరంలో 15 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని మన్యం ప్రాతంలో ప్రజలు చలికి వణుకుతున్నారు. ప్రకృతి ప్రేమికులు లంబసింగి, పాడేరు, అరకు ప్రాంతాలకు పయనం అయ్యారు ఓ వైపు మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి దృశ్యాలను చుస్తూ ప్రకృతి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. మరోవైపు చలికి వృద్ధులు, చిన్న పిల్లలు చలి మంటలు వేసుకుని తమ శరీరాలను వెచ్చ పర్చుకుంటున్నారు. అయితే చిన్నపిలల్లు, వృద్ధులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..