వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025.. వేదిక స్విట్జర్లాండ్ మహానగరి దావోస్.. కార్పొరేట్ పెట్టుబడుల్ని ఒడిసిపట్టే చాకచక్యానికి పరీక్షా స్థలం. ఈ రంగస్థలంలో ఈసారి ఆవిష్కృతమైన అరుదైన దృశ్యం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి పాల్గొనడం.. కార్యశూరులని, రాజకీయాల్లో గురుశిష్యులని ఇద్దరికీ పేరుబడ్డం.. తమతమ రాష్ట్రాల భవిష్యత్తు కోసం తన-మన బేధాలు మరిచి పెట్టుబడుల వేటలో పోటీపడ్డం.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇద్దరూ తమతమ బృందాలతో దావోస్‌కి తరలివెళ్లారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే పెట్టుబడుల సమీకరణ.. దాంతో ఒనగూడే పారిశ్రామిక ప్రగతి. ఒకరి చేతిలో ప్రగతిపథంలో వేల యోజనాలు ముందుకు దూసుకుపోయిన విశ్వనగరం హైదరాబాద్. మరొకరి చేతిలో మాత్రం తప్పటడుగులు వేస్తూ శైశవ దశను దాటని రాజధాని అమరావతి నగరం. మరి.. ఇద్దరికీ పొంతనెక్కడ..? ఐనాసరే.. దావోస్ వేదికపై రెండు రాష్ట్రాల మధ్య పోటీతత్వం అనివార్యమైంది.
మరొక్కమాటలో చెప్పాలంటే.. పెట్టుబడుల్ని ఆకర్షించడం తెలంగాణ ప్రభుత్వానికి నల్లేరు మీద నడకే. ఎందుకంటే.. హైటెక్ హంగులు, మెట్రో, ఓఆర్‌ఆర్ లాంటి మేలి మెరుగులున్న మహానగరం.. రేపటిరోజున రాబోతున్న ఫ్యూచర్‌సిటీ.. కార్పొరేట్ శక్తుల్ని ఇట్టే ఆకట్టుకునే వనరులు. కానీ.. అర్బనీకరణలో స్పష్టమైన కొరతలున్న ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌ని రాబట్టుకోవడం అనేది అతిపెద్ద సవాల్. నిజానికి ఇది చంద్రబాబునాయుడికి అగ్నిపరీక్ష లాంటిది. అందుకే.. సుస్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక.. రాష్ట్ర భవిష్యత్తుపై తనదైన విజన్.. ఇవి మాత్రమే ఆయుధాలుగా వేట కొనసాగించారు. తన అనుభవ సారాన్నంతా ప్రయోగించి.. దావోస్ నుంచి లాభంగా తిరిగి రావాలని తాపత్రయపడ్డారు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనపై సహజంగానే ఫోకస్ పెరిగింది. ఇద్దరు నేతల మూడురోజుల దావోస్ పర్యటన ఫలితాల్ని కూడా తూకం వేయక తప్పని పరిస్థితి.
తెలంగాణ విషయానికి వస్తే….
కేవలం మూడు రోజుల్లో లక్షా 30 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి డీల్స్ ఓకె చేసుకున్నారు. నిజానికి ఇదొక రికార్డ్. ఇవన్నీ ఒక ఎత్తయితే.. చివర్లో నాలుగవ రోజు ఏకబిగిన 91 వేల 500 కోట్ల డీల్స్ ఓకే కావడం అనేది నభూతో నభవిష్యత్ అని చాటుకుంటోంది తెలంగాణ సర్కార్. అమెజాన్ 60 వేల కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15 వేల కోట్లు, అక్షత్ గ్రీన్‌టెక్ 7 వేల కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5 వేల కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు.. ఇలా డే-4ని కూడా బ్లాక్‌బస్టర్‌గా మార్చుకుంది టీ-సర్కార్. ఇప్పటికే తెలంగాణలో పాతుకుపోయిన ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు.. భారీ స్థాయిలో విస్తరణ ప్రణాళికలు ప్రకటించేశాయి. HCL సంస్థ కూడా తెలంగాణ పెవిలియన్‌లోకొచ్చి.. బంపరాఫర్లు ఇచ్చేశారు. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో HCL టెక్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డీల్ కుదిరింది. వీటి ద్వారా పాతిక వేల మందికి పైగా ఉద్యోగాలొస్తాయని చాటింపు వేసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. దావోస్ డీల్స్ అన్నీ కార్యరూపం దాల్చి.. పెట్టుబడులన్నీ క్షేత్రస్థాయికి దిగొస్తే.. రాష్ట్రంలో 49 వేల 500 మందికి పైగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నది ఒక అంచనా.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం, మెట్రో విస్తరణ.. ఇవన్నీ కలిసి ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ వైపు ఆకర్షింపజేశాయి. నా పోటీ ఏపీతో గాని, మహారాష్ట్రతో గాని, కర్నాటకతో గానీ కాదు.. న్యూయార్క్, టోక్యో లాంటి గ్లోబల్ సిటీస్‌తోనే తలపడుతున్నా అంటూ గ్లోబల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. మొత్తానికి కార్యసాధకుడిగా తిరిగొచ్చారంటూ సీఎం రేవంత్‌కి హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికింది కాంగ్రెస్ క్యాడర్.
కానీ.. ఇదంతా హైపే తప్ప హోప్ లేదంటూ విపక్షాలు వ్యతిరేక రాగం అందుకున్నాయి. ఉన్న పెట్టుబడులనే చూపెట్టి.. కొత్తగా వచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారనేది రేవంత్ సర్కార్‌పై వస్తున్న ప్రధాన అభియోగం. ఎందుకంటే.. అమెజాన్, ఇన్‌ఫోసిస్, విప్రో ఇప్పటికే హైదరాబాద్‌లో స్థిరపడ్డ సంస్థలు. క్యాంపస్‌లను విస్తరించడం అనేది వాళ్లు సొంతగా తీసుకున్న ఇంటర్నల్ కార్పొరేట్ నిర్ణయం. ఇందులో మీదేముంది గొప్పతనం అనేది అపోజిషన్ పార్టీల లాజిక్. కానీ.. ఎక్స్‌పాన్షన్ కూడా ఒకరకమైన పెట్టుబడేగా అనేది సర్కారీ సమర్థింపు. ఐనా.. కంపెనీలు అలా ఒప్పందాలు రాసుకోగానే ఇలా ప్రొడక్షన్ మొదలుపెడతాయన్న గ్యారంటీ లేదు. ఇక్కడ ఒప్పందం అంటే.. ఆసక్తి కనబరుస్తున్నట్టు పరస్పరం రాసుకున్న పత్రం మాత్రమే. డీల్ ప్రకారం పెట్టుబడి పెట్టకపోతే సదరు కంపెనీ మీద కోర్టుకెళ్లే అవకాశం కూడా ఏ ప్రభుత్వానికీ లేదు.
ఎవరి హయాంలో ఎన్నిసార్లు దావోస్ వెళ్లారు.. పదేళ్లలో బీఆర్ఎస్ జమానాలో జరిగిన ఒప్పందాలెన్ని.. వాటిలో ఎన్నికోట్లు రియాలిటీలోకొచ్చాయి.. ఇప్పుడు రేవంత్ హయాంలో రాసుకున్న డీల్స్ ఒరిజినాలిటీలేంటి.. అన్నీ కలిపి శ్వేతపత్రం రిలీజ్ చెయ్యాలన్న డిమాండ్లు కూడా మధ్యస్థుల నుంచి వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పారిశ్రామిక అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకూడదన్న రేవంత్‌రెడ్డి సంకల్పానికి ప్రశంసలొస్తున్నాయి. తెలంగాణలోని సెకండరీ గ్రేడ్ నగరాల్లో కూడా క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ఐటీ దిగ్గజాల దగ్గర రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకోవడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా.. దావోస్ టూర్ విషయంలో తెలంగాణకు గేమ్‌ఛేంజర్ రేవంత్‌రెడ్డేనన్న మాటను ఘనంగా ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.
ఏపీ విషయానికి వస్తే….
మై ఏపీ.. మై అమరావతి.. మై విజన్.. ఇదీ నినాదం. మెరుపుకలలు కనడం.. వాటిని సాకారం చేసుకోవడం.. ఇదీ కార్యాచరణ. ఫలితం గురించి ఆలోచించకుండా.. గమ్యం వైపే నా ప్రయాణం.. అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే.. మధురస్మృతులు, అమూల్యమైన భరోసాలతో పండగలా సాగింది చంద్రబాబు దావోస్ టూర్.
అసలే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం. రేవంత్‌రెడ్డితో పోలిస్తే చంద్రబాబుకు పరిచయాలు కూడా ఎక్కువ. ఒక్కోసారి కార్పొరేట్ లాబీయింగ్‌లో పాత పరిచయాలు కూడా వర్కవుటౌతాయి. అలాగని నాయకుని ఇమేజ్‌ని బట్టే పెట్టుబడులు వచ్చేస్తాయన్న నమ్మకాలూ లేవు. అందుకే.. ప్లస్‌లూ, మైనస్సుల్ని లెక్కలేసుకుంటూ.. తనేంటో ప్రూవ్ చేసుకుంటూ.. అంతర్జాతీయ కంపెనీలతోపాటు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమౌతూ.. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే ప్రయత్నం చేస్తూ మూడురోజులపాటు దావోస్ టూర్‌ని దిగ్విజయంగా ముగించారు చంద్రబాబు.
మొదటిరోజు జ్యూరిక్‌లో స్విస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో స్పూర్తివంతమైన స్పీచ్ ఇచ్చారు. జన్మభూమి కోసం తోడ్పడాలని ప్రవాసులను కోరారు. రెండోరోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై జరిగిన సదస్సులో సుదీర్ఘంగా ప్రసంగించారు. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగంలో ఏపీ గ్లోబల్ హబ్‌గా మారబోతోందని, తమ ప్రభుత్వం కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉండబోతోందని చెప్పారు. మూడోరోజు టెక్నాలజీ గ్లోబల్ లీడర్‌గా ఉన్న కాగ్నిజెంట్ సంస్థ సీఈఓతో భేటీ అయ్యారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఏపీ బెటర్ ప్లేస్ అని చెప్పారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో సమావేశమై ఏపీలో జరిగిన టెక్నలాజికల్ ఎడ్వాన్స్‌మెంట్‌ను వివరించారు. నిపుణులైన యువత ఉన్న ఏపీ.. ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ కాబోతోందని చెప్పారు. బిల్డింగ్ ది నెక్ట్స్ పెట్రోకెమికల్ హబ్ అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ చర్చలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. పోర్టులు, లాజిస్టిక్స్, స్కిల్డ్ టాలెంట్.. అన్నిటికీ ఏపీ కేరాఫ్ ఐందన్నారు. అవకాశం వచ్చిన ప్రతీచోటా ఏపీ బ్రాండ్‌ని పెంచే ప్రయత్నమే చేశారు.
టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. అప్పుడు ఐటీ కోసం, ఇప్పుడు ఏఐ కోసం మేమిద్దరం అంటూ గత జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నారు. ఏపీలో తలపెట్టిన కృత్రిమ మేథ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం తీసుకోవాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు బిల్ గేట్స్.
ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా ఉంటూ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో, WTCA గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో, WEF హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో, టెమాసెక్ హోల్డింగ్స్ ఇండియా హెడ్ రవి లాంబాతో, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో.. ఇలా నాన్‌స్టాప్‌గా వన్‌టువన్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్‌లోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని, విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని కోరారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త వస్తుందని కూడా చెప్పారు.
దావోస్‌లో మరో హైలైట్ ఏంటంటే.. టీమ్ ఇండియా ఎట్ దావోస్.. అంటూ సోషల్ మీడియాలో మెరిసిన ఒక గ్రూప్ ఫోటో. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి తీసుకున్న రేరెస్ట్ పిక్ ఇది. ఇలా అమూల్యమైన జ్ఞాపకాలు, పారిశ్రామికవేత్తలు భరోసాలతో.. ఏపీ బ్రాండ్ బిల్డింగ్‌పై ఫోకస్ పెడుతూ సాగింది సీఎం చంద్రబాబు దావోస్ టూర్.
దావోస్ నుంచి తిరుగుపయనమై గురువారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో గంటపాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్ధిక సహకారం, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత, విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ అమలు.. ఇలా అనేక అంశాలపై చర్చించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు.
ఇటు.. చంద్రబాబు దావోస్ టూర్‌పై ఏపీలో హాట్‌హాట్ చర్చ జరుగుతోంది. దారిఖర్చులు దండగ అనే థీమ్‌తో ఎటాక్ షురూ చేసింది వైసీపీ. తండ్రీకొడుకులు ఖాళీ చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేస్తోంది ఏపీలో విపక్షం. దావోస్ పర్యటనను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని, ఏపీ ఇమేజ్ కోసం కాదు.. చంద్రబాబు ఇమెజ్ పెంచుకోడానికే దావోస్ వెళ్లారని విమర్శలెత్తుకుంది.
కానీ.. వైసీపీకి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌పై మాట్లాడే అర్హతే లేదంటోంది టీడీపీ. గతంలో దావోస్‌ని చాలా తేలిగ్గా తీసిపడేసిన ఫ్లాష్‌బ్యాకుల్ని బైటికి తీస్తోంది కూడా. మైనస్ 10 డిగ్రీల చలి ఉంటుంది.. అందుకే దావోస్‌కి వెళ్లలేదన్న మంత్రి అమర్‌నాథ్ ఇప్పుడు తమకు సుద్దులు చెప్పడం ఏంటని నిలదీస్తోంది. పెట్టుబడులు తెచ్చామని అధికారపక్షం, రాలేదని విపక్షం ఇటువంటి రాజకీయ విమర్శలు మామూలే. ఎందుకంటే.. ఇవాళారేపూ దావోస్ టూర్లంటే పొలిటికల్ ఫీట్లుగా మారిపోయాయి. లీడర్ ఇమేజ్‌ని పెంచుకోవడం కోసం, పొలిటికల్ ప్రొఫైల్‌ని మెరుగుపర్చుకోవడం కోసం దావోస్‌ని వాడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో తెలుగురాష్ట్రాల్లో ఇదొక ట్రెడిషన్‌గా మారింది కూడా.
ప్రపంచ వాణిజ్య సదస్సు అంటే రాజకీయ, పారిశ్రామిక ప్రతినిధులు కలిసి కూర్చుని, ఒకర్నొకరు పరిచయం చేసుకుని.. తమతమ వాణిజ్య పాలసీల్ని షేర్ చేసుకుని, వ్యాపార అవకాశాల్ని ఆవిష్కరించుకునే వేదిక. మరో మాటలో చెప్పాలంటే.. దావోస్‌లో పెట్టుబడుల ముచ్చట్లంటే పెళ్లిచూపుల్లాంటివి. కులగోత్రాలు చెప్పుకుని, కట్నకానుకల్ని మాట్లాడుకుని తిరిగొచ్చేయడమే. ప్రతీ పెళ్లిచూపులూ సక్సెస్సయ్యి పెళ్లిదాకా దారితియ్యవు. దావోస్‌లో జరిగే వాణిజ్య ఒప్పందాలు కూడా అంతే. వాటిమీద పెద్దగా నమ్మకాలు పెట్టుకోవద్దని చెప్పే తార్కాణాలు గతంలో బోలెడన్ని. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న బిగ్ డీల్స్ మీద, కార్పొరేట్ జెయింట్స్‌తో ఏపీ సర్కార్ జరిపిన సమావేశాల మీద చర్చ అవసరమా లేదా అనేది ఒకానొక హైపొథెటికల్ క్వశ్చన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..