Telangana: ఎంతో వైభవంగా కొనసాగుతున్న పెళ్లి బరాత్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. పెళ్లికొడుకు చేసిన పనికి బాలుడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలకు చెంది మల్లేష్ వివాహం,యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో బుధవారం జరిగింది. అదే రోజు రాత్రి వధువుతో కలిసి స్వగ్రామానికి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో వరుడి ఇంటికి కొద్ది దూరం నుంచి డీజే పాటలతో బరాత్ ఏర్పాటు చేశారు. దాంతో వరుడు కారు దిగి బంధువులతో కలిసి కొద్దిసేపు డాన్స్ చేశాడు.
అనంతరం తిరిగి కారులోకి వెళ్లిపోగా అక్కడ డ్రైవర్ సీట్‌లో డ్రైవర్ లేకపోవడంతో.. వరుడు కారు నడిపే ప్రయత్నం చేశారు. అతనికి డ్రైవింగ్ రాకపోవడంతో కారుని కంట్రోల్ చేయలేపోయారు. దీంతో ఒక్కసారిగా కారు డాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. డీజే వెహికల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుబ్బాకకు చెందిన 13 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పెళ్లికొడుకుతోపాటు మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదానికి కారణమైన పెళ్లికొడుకు మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..