పండగ సీజన్‌కు తోడు హుజురాబాద్ ఉప ఎన్నిక రావడంతో అక్టోబర్ మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఒక్క అక్టోబర్ మాసంలోనే ఏకంగా రూ.2653.07 కోట్ల మద్యం అమ్ముడైందని రాష్ట్ర ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. గతేడాది అక్టోబర్‌లో దాదాపు రూ.2, 623 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..ఈ ఏడాది రూ.30 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి. ఇక 2019 అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది రూ. వెయ్యికోట్ల అదనపు ఆదాయం రావడం గమనార్హం.
ఉప ఎన్నిక కూడా ఒక కారణమే..
గతంలో బీర్ల ధరలు ఎక్కువగా ఉండడంతో వాటి విక్రయాల్లో కొద్ది మేర తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను తగ్గించింది. దీంతో గతేడాది కంటే ఈసారి బీర్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2020 అక్టోబర్‌లో 26.93 లక్షల బీరు కేసులు అమ్ముడవగా, ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ఇది 31.43లక్షల కేసులకు చేరుకుంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ పరిధిలో కూడా మద్యం విక్రయాల్లో భారీ పెరుగుదల కనిపించింది. గత ఏడాది అక్టోబర్ కన్నా ఈ ఏడాది దాదాపు రూ. 4కోట్ల మేర ఆదాయం పెరిగింది. దేశంలో మద్యం వినియోగిస్తున్న టాప్-5 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఏటా దసరా పండగ సందర్భంగానే సహజంగానే మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయని, అవి ఈసారి మరింత పెరిగాయని రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా మద్యం విక్రయాల పెంపునకు కారణమైందని వారు తెలిపారు.
Also Read: