Medaram jatara: సంక్లిష్ట పనిని విజయవంతంగా పూర్తి చేశారు.. మేడారంపై సజ్జనర్ ట్వీట్‌

జాతర విజయవంతంగా ముగియడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా జాతరకు ఆర్టీసీ అందించిన సేవలకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. వీడియోతో పాటు పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు...

Medaram jatara: సంక్లిష్ట పనిని విజయవంతంగా పూర్తి చేశారు.. మేడారంపై సజ్జనర్ ట్వీట్‌
TSRTC MD Sajjanar

Updated on: Feb 25, 2024 | 8:12 PM

అంగరంగ వైభవంగా సాగిన మేడారం జాతర ముగిసింది. దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత పూజారులు రాత్రి 7.27 నిమిషాలకు వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది.

జాతర విజయవంతంగా ముగియడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా జాతరకు ఆర్టీసీ అందించిన సేవలకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. వీడియోతో పాటు పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని.. మొక్కులు సమర్పించుకున్నారు. బస్సుల్లో తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకున్నారు’ అని రాసుకొచ్చారు.

‘మేడారం జన జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన తెలంగాణ ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు. అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలుచేశారు. ఈ జాతరలో ప్రతి ఒక్క సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించి.. ఉన్నతస్థాయి వృత్తి నైపుణ్యాన్ని కనబరిచారు. లక్షలాది మంది భక్తులను జాతరకు చేర్చే కీలకమైన, సంక్లిష్టమైన పనిని సమిష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేశారు’ అని పేర్కొన్నారు.

‘తమ ప్రయాణ సమయంలో భక్తులు టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో సహకరించారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తున్నామని, ప్రోత్సహిస్తున్నామని మరోసారి నిరూపించారు. మేడారం మహాజాతరలో తెలంగాణ ఆర్టీసీ సేవలను వినియోగించుకుని, సిబ్బందికి సహకరించిన భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..