
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఆన్‌లైన్లో ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే టీజీఎస్‌ఆర్‌టీసీ పోర్టల్ అందుబాటులో ఉండేది. అయితే ఇక నుంచి మరో సుదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ప్రయాణికులు మీ సేవ మొబైల్ యాప్‌లో కూడా TGSRTC బస్ టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సులకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ ఈ కొత్త యాప్‌ను ప్రారంభించారు. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి, మీసేవ కమీషనర్ రవికిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ OPRS సేవలను కూడా అనుసంధానించారు. దీంతో ప్రయాణీకులు సుదూర ప్రయాణాలు, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
-మొత్తం OPRS సేవలు: 1,710
-ఏసీ సేవలు: 450
-నాన్ ఏసీ సేవలు: 1,260
-రోజువారీగా బుకింగ్ ఆయ్యే సీట్లు: 13,000
బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల,ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ బుకింగ్ సౌకర్యం
– గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఐదు రకాల బస్ పాస్‌లు పొందే సౌకర్యం, రెన్యూవల్ చేసుకునే సదుపాయం
ఇప్పటివరకు బస్ పాస్‌లు పొందాలంటే ప్రత్యేక బస్ పాస్ కౌంటర్లను సంప్రదించాల్సి వచ్చేది. అక్కడ క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి డిజిటల్ విధానంలో బస్ పాస్‌లను పొందవచ్చు. దీని వల్ల బస్ పాస్ కౌంటర్లను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఇక బస్ పాస్‌లను రెన్యూవల్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది. రోజూ హైదరాబాద్‌లో బస్ పాస్ ద్వారా లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వారికి ఇది ఊరటగా చెప్పవచ్చు.
-సిటీ ఆర్డినరీ పాస్ నెలకు రూ.1,400
-మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1,600
-మెట్రో డీలక్స్ పాస్ రూ.1,800-
– గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ నెలవారీ పాస్ అమ్మకాలు: 2,200
-పుష్పక్ A/C పాస్ రూ.5,000