Today Mirchi Rate: రైతును మీసం మెలేపిస్తున్న ఎండు మిర్చి.. రికార్డు బద్దలు.. పంట పండినోడు కింగే
బంగారం ధరను క్రాస్ చేసింది ఎర్ర బంగారం. ఉమ్మడి వరంగల్ జిల్లా స్పెషల్ అయిన దేశీ రకం మిర్చికి ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికింది. ఈ సీజన్‌లో మొదట్నుంచీ బంగారం ధరలతో పోటీపడుతూ వస్తోంది మిర్చి.

ఎండు మిర్చి ధర బంగారాన్ని దాటిపోయింది. నాన్ స్టాప్‌గా పరుగులు తీస్తుంది. తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతుంది. తాజాగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎర్రబంగారం రికార్డుల మోత మోగించింది. దేశీ కొత్త మిర్చి క్వింటాల్ కు 80,100 రూపాయలు పలికింది. ఈ ఏడాది ఇదే రికార్డు ధర అని చెబుతున్నారు. గత ఏడాది 90వేల రూపాయలకు పైగా పలికింది క్వింటా మిర్చి ధర. ఎన్నడూ లేని విధంగా మిర్చికి రికార్డు ధర రావడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు రైతులు. దీన్ని బట్టి మిర్చికి డిమాండ్ ఎలా పెరిగింది, ధరలు ఎలా ఎగబాకుతున్నాయో అర్థమవుతుంది.
దేశీ మిర్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో ఎర్రమట్టి నేలల్లోనే దేశీ మిర్చి పండుతుంది. అయితే దీని సాగు కత్తి మీద సామే. ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. మిర్చి తోటలను పసిపిల్లల్ని సాకినట్టు కంటికి రెప్పలా కాపాడాలి. గట్టిగా ఒక్క వాన పడితే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పంట చేతికొచ్చే సమయంలో టైమ్‌లో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోయారు. దిగుబడి పడిపోయింది.
అయితే రికార్డు ధర పలకడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఏమైనా ఇక్కడ ఎర్రమట్టి నెలల్లోనే పండే ఎర్రబంగారం ఆల్ టైమ్ రికార్డు ధరతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈసారి పంట ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే మిర్చి ధరలు పసిడిని దాటి పరుగులు పెడుతున్నాయి అంటున్నారు నిపుణులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
