
తెలంగాణలో పేదల ఇంట మే నెల రేషన్ పండుగను తీసుకొచ్చింది. కొత్తగా 11 లక్షల మందికి పైగా రేషన్ లబ్ధిదారులుగా గుర్తింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు రేషన్ పొందే వారి సంఖ్య 2.93 కోట్లకు చేరుకుంది. ఈసారి ప్రభుత్వం పరిశీలన చేసి అర్హులైన వారికి కొత్త కార్డులు జారీ చేసింది.
⸻
కొత్త కార్డులకు గ్రీన్ సిగ్నల్
తాజా గణాంకాల ప్రకారం 31,084 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటి ద్వారా 93,584 మంది సభ్యులు లబ్ధిదారులుగా గుర్తింపు పొందారు. పాత కార్డుల్లో అదనంగా 10,12,199 మంది పేర్లు చేరాయి. ఈ మేరకు అధికారుల ద్వారా కార్డుల జారీ, సభ్యుల చేర్పు ప్రక్రియ పూర్తయింది.
⸻
బియ్యం సరఫరాలో పెరుగుదల
రాష్ట్రంలో రేషన్ బియ్యం కోటా కూడా తగినట్లుగానే పెరిగింది. జనవరిలో 1.79 లక్షల టన్నులుగా ఉన్న బియ్యం కోటా, మే నెల నాటికి 1.86 లక్షల టన్నులకు చేరింది. కొత్త లబ్ధిదారుల అవసరాల కోసం అదనంగా 4,431 టన్నుల బియ్యాన్ని అధికారులు సరఫరా చేస్తున్నారు.
⸻
పాత కార్డుల్లో కొత్త చేర్పులు – కొన్ని తొలగింపులు
జనవరి నుంచి మే మధ్యలో ప్రభుత్వం 19 లక్షలకు పైగా లబ్ధిదారులను కొత్తగా గుర్తించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల 7 లక్షలకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్నవాళ్లు వివాహం తర్వాత వేరుగా ఉండటంతో కార్డుల్లో మార్పులు జరిగాయి. చివరికి నికరంగా 12 లక్షల మందికి కొత్తగా రేషన్ అందనుంది.
⸻
మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల తుది పరిశీలన
ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా మూడు లక్షల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు వాటిని దశలవారీగా పరిశీలిస్తున్నారు. భర్త, భార్య వేర్వేరు కార్డుల్లో ఉన్నవారికి ఒక్కటిగా చేయడం, కొత్తగా పిల్లలను చేర్చడం వంటి ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…