
తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు రూ.లక్ష ఆర్ధిక సాయం అందించనుంది. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే ఈ పథకానికి అర్హులైన యువతీయువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను కూడా ఎంపిక చేసి తుది జాబితా రూపొందించారు. అయితే ఇప్పుడు వారికి రూ.లక్ష ఆర్ధిక సాయం విడుదల చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. నవంబర్ 19వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుండగా.. ఆ రోజు నుంచి అర్హులకు రూ.లక్ష సాయం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ఏర్పాట్లు ఇప్పటినుంచే చేయాలని ఆదేశించారు.
నిరుద్యోగ యువత సొంతగా ఉపాధి పొందేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హతలు, దరఖాస్తులు, ఎంపికకు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనుంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయం ద్వారా యువత తమకు నచ్చిన రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చు. ప్రజాభావన్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం పధకంపై చర్చించారు. అనంతరం యువతకు నగదు త్వరగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అమలు, గురుకులాల నిర్వహణపై కూడా చర్చించారు. విద్యారంగం అభివృద్దికి నిధులు కొరత రాకుండా చూసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు. ఇప్పటికే ఈ పథకం కసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను ఎంపిక చేశారు. అర్హులకు నవంబర్ నుంచి సాయం అందించనున్నారు. సాయాన్ని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని యువత కోసం కొత్తగా తీసుకొచ్చింది.