AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జనసేనలో కొత్త ఊపు.. పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన గడల శ్రీనివాసరావు

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ తన ఉనికిని బలంగా చాటేందుకు అడుగులు వేస్తున్న వేళ.. ఆ పార్టీకి ఊపు తీసుకొచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ప్రజలకు సుపరిచితమైన పేరు, తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేనలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Telangana: జనసేనలో కొత్త ఊపు.. పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన గడల శ్రీనివాసరావు
Dr. Gadala Srinivasa Rao Joins Jana Sena
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 03, 2026 | 8:58 PM

Share

ఇటీవలే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ప్రకటన వేడి ఇంకా చల్లారకముందే గడల శ్రీనివాసరావు పార్టీలో చేరడం.. తెలంగాణలో జనసేన విస్తరణకు శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది. కరోనా సమయంలో ఆయన ప్రజలకు సుపరిచితుడే. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గడల శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పిన పవన్ కళ్యాణ్.. ఆయన చేరిక జనసేనకు మరింత విశ్వసనీయతను తెస్తుందని వ్యాఖ్యానించారు. తమ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, ప్రజాసేవ పట్ల గడల నిబద్ధత పార్టీకి బలంగా మారుతుందని చెప్పారు.

ఇక గడల శ్రీనివాసరావు కూడా తన నిర్ణయం భావోద్వేగంతో తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నాయకత్వం వహించే లక్షణం పవన్ కళ్యాణ్‌లో కనిపించిందని, అందుకే జనసేనను వేదికగా ఎంచుకున్నానని తెలిపారు. తెలంగాణలో పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. అయితే గడల రాజకీయ ప్రయాణంపై చర్చ ఇప్పుడు కొత్తది కాదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆయనకు అవకాశం దక్కలేదు.

ఆ తర్వాత రాజకీయంగా కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన, పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆయన తదుపరి అడుగుపై సంకేతాలు ఇచ్చాయి. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది.

గడల చేరిక కేవలం ఒక నాయకుడి పార్టీ మార్పుగా కాకుండా.. తెలంగాణలో వైద్య, ఉద్యోగి, మధ్యతరగతి వర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా జనసేన తన సామాజిక విస్తరణకు ప్రయత్నిస్తున్నదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్‌కు ఇది తొలి పెద్ద రాజకీయ బూస్టర్‌గా మారుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us