CM KCR: ముక్త్‌భారత్‌పై కేసీఆర్ ఫోకస్.. రాజ్యాంగ ఉల్లంఘన, విద్యుత్ సంస్కరణలే అస్త్రం, త్వరలో దేశవ్యాప్త ఉద్యమం?

|

Mar 05, 2022 | 5:31 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం ఒక్కటే కనిపిస్తోంది.. మిషన్‌-2024..! ఒకే దెబ్బకు రెండు పిట్టలు.! ఇదే CM కేసీఆర్‌ ప్లాన్‌. ప్లానింగ్..! ఢిల్లీ కోటను ఢీ కొట్టాలి.! అదే టైమ్‌లో రాష్ట్రంలోనూ తిరుగులేని శక్తిగా ఎదగాలి.!

CM KCR: ముక్త్‌భారత్‌పై కేసీఆర్ ఫోకస్.. రాజ్యాంగ ఉల్లంఘన, విద్యుత్ సంస్కరణలే అస్త్రం, త్వరలో దేశవ్యాప్త ఉద్యమం?
Kcr Modi
Follow us on

Telangana CM KCR Political Strategy: టార్గెట్‌ వెరీ క్లియర్.! బీజేపీ ముక్త్‌భారత్‌.! మరి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ(BJP), కాంగ్రెస్‌(Congress)కు వ్యతిరేకంగా నడిచేదెవరు? థర్డ్‌ ఫ్రంట్‌(Third Front)లో చేరేది ఎవరు? అందరినీ ఏకతాటిపైకి తేవడం ఎలా? ఇవే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్న సవాళ్లు. మరి వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో పక్కా ఫ్లాన్‌తో వెళ్తున్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడ్రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్‌.. గురువారం కీలక సమావేశాలతో బిజీబిజీగా గడిపారు.

ఇటీవల జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌తో సమావేశమైన కేసీఆర్‌.. దేశరాజకీయాలపై చర్చించారు. సీఎం హేమంత్‌ సోరెన్‌, కేసీఆర్‌ల భేటీలో… జేఎంఎం అధినేత మాజీ సీఎం శిబూసోరెన్ కూడా పాల్గొన్నారు. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు కేసీఆర్‌. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్నారు కేసీఆర్. దేశానికి దశదిశ చూపే సరైన ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి.

మరోవైపు రాంచీ ఎయిర్‌ పోర్టులో కేసీఆర్‌కు గ్రాండ్ వెల్‌ కమ్‌ లభించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ CM జార్ఖండ్ టూర్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాఫిక్‌గా మారింది. కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. దేశ్‌ కీ నేత కేసీఆర్‌ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ ఫెడరల్ నేతకు ఘన స్వాగతం పలికిన జార్ఖండ్ ప్రజలు అంటూ.. అధికారికంగా నోట్‌ విడుదల చేసింది CMO. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్‌… ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది.

మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు కేసీఆర్. ఇప్పటికే మహారాష్ట్రలో పర్యటించిన ఆయన CM ఉద్దవ్‌ థాక్రేతోపాటు.. NCP అధినేత శరద్‌పవార్‌తోనూ సమావేశం అయ్యారు. అటు పశ్చిమబెంగాల్ CM మమతాబెనర్జీ, తమిళనాడు CM స్టాలిన్, కేరళ CM విజయన్‌తోపాటు పలు పార్టీల నేతలో ఇప్పటికే చర్చలు జరిపారు కేసీఆర్..

ఇదిలావుంటే ముఖ్యమంత్రితో బీజేపీ నేత, ఎంపీ సుబ్రమహ్మణ్యస్వామి సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్న కేసీఆర్‌ను.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కలవడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ కూడా కలిశారు. అయితే సుబ్రహ్మణ్యస్వామితో ధర్డ్ ఫ్రంట్ రాజకీయాలపై చర్చించే అవకాశం లేదు. అలాగే రాజకీయాలతో సంబంధం లేని రాకేష్ టికాయత్ తో కూడా మూడో కూటమిపై చర్చించే అవకాశం లేదు. కానీ వారిద్దరూ కలిసే కేసీఆర్‌తో సమావేశయ్యారు. వారితో కలిసి కేసీఆర్ లంచ్ కూడా చేశారు. సుబ్రహ్మణ్య స్వామికి వచ్చే జూన్‌తో రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతుంది. ఆయనను ఇప్పటికే బీజేపీ వదిలించుకుంది. ఆయన తనకు రాజ్యసభ సీటు ఎవరిస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ అవకాశం ఇస్తారమో అని చూశారు. కానీ జగన్ వైపు నుంచికూడా స్పందన లేకపోవడంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఓ సారి మమతా బెనర్జీని పొగుడుతారు. మరో సారి మరో నేతను పొగుడుతారు. అన్నీ రాజ్యసభ సీటు కోణంలోనే. కానీ ఎవరూ ఆయనను ప్రోత్సహించడం లేదు. తాజాగా ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఎదుట రాజ్యసభ ప్రతిపాదన పెట్టారో లేదో స్పష్టత లేదు కానీ, ఆయన టార్గెట్ మాత్రం అదేనని సుబ్రహ్మణ్య స్వామి ప్రయత్నాల గురించి తెలిసిన వాళ్లు చెబుతూంటారు.

ఇక రాకేష్ టికాయత్.. సీఎం కేసీఆర్ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి కేసీఆర్ నష్టపరిహారం ప్రకటించారు. బహుశా వాటి పంపిణీ గురించి చర్చించిఉంటారని భావిస్తున్నారు. చనిపోయన వారి లిస్ట్‌ను టికాయత్ వద్ద నుంచేతీసుకుంటానని కేసీఆర్ ప్రకటించారు. ఈ కారణంతో కేసీఆర్‌తో భేటీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించానని రైతు సంఘాల నాయకుడు రాకేష్‌ టికాయత్‌ వెల్లడించారు. తాను ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో వ్యవసాయరంగ అనుకూల విధానాలు అమలు అవుతున్నాయన్నారు. రైతుబంధు, ఉచిత కరెంట్‌తోపాటు అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రిని ఆయన కొనియాడారు. దేశ రైతాంగం కోసం ప్రత్యామ్నాయ నూతన విధానం రావాల్సిన అవసరముందని రాకేష్‌ టికాయత్‌ అన్నారు.

ఈ క్రమంలోనే కేంద్రం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ పోరాటానికి సిద్ధమయ్యారు. విద్యుత్ సంస్కరణలను నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి ఆయన తెరదీసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో విద్యుత్ రంగ నిపుణులు, కార్మికులతో ఆయన సమావేశం కానున్నట్లుగా సమాచారం. కాగా.. కొద్దిరోజుల క్రితం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మోడీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటన్నారు. మోడీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మోడీ వల్ల దేశం ఎంత నాశనమవుతుందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని సీఎం ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని కేసీఆర్ దుయ్యబట్టారు.

మోడీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని… పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని.. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని కేసీఆర్ తెలిపారు. మీటర్లు పెట్టమనకుండానే జగన్‌మోహన్ రెడ్డిపెట్టారా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఇవేమీ తెలియదని.. రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా, తాను మీటర్లు పెట్టలేదని సీఎం వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే.. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్‌… ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది.

— రాకేష్ రెడ్డి, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్

Read Also…. 

Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే

Telangana: తెలంగాణాలో ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఉన్నత విద్యామండలి..ఆ విషయంలో నిబంధనలు సడలింపు