
తెలంగాణపై వరుణుడు దండెత్తాడు. వర్షాల తాకిడి అన్ని జిల్లాల్లోనూ కనిపిస్తుండగా.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శుక్రవారం, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే గురువారం రోజంతా హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. జన జీవనాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 836 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. అత్యధిక వర్షపాతం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.5 సెంటీమీటర్లుగా నమోదు కాగా, అదే జిల్లాలోని సిర్పూర్(T) మండలం లోనవెల్లిలో 5.7 సెంటీమీటర్లు, బెజ్జూరులో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పెంచికులపేట మండలం యెల్కపల్లిలో 3 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2.6 సెం.మీ. వర్షం పడింది. మరోవైపు ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కిన్నెరసాని, ముర్రేడు, తాలిపేరు, జిల్లేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో పలు లోతట్టు వంతెనలు మునిగిపోయాయి. ఖమ్మం జిల్లా చిన్నమండవకు చెందిన పశువుల కాపరులు మున్నేరులో పెరిగిన వరద నీటిలో ఓ లంకలో చిక్కుకుపోయారు. వారిని ఖమ్మం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు పడవల సాయంతో రక్షించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శుక్రవారం కామారెడ్డి, మెదక్, జనగామ, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదివారం నాడు మళ్లీ పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉండగా, సోమవారం హైదరాబాద్‌తో పాటు మిగిలిన పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం, గురువారం సీఎంవో అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్లు సహా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువులు, కుంటలు నిండిపోయే స్థితిలో ఉండడంతో ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..