తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియమాక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది. మొత్తం 17,516 పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో ఎస్సై పోస్టులు 587 ఉండగా..కానిస్టేబుల్ పోస్టులు 16,929 వరకు ఉన్నాయి. దాదాపు 1,79,459 మంది అభ్యర్థులు తుది రాతపరీక్షలకు హాజరవగా.. వీరిలో 1,50,852 (84.06%) మంది అర్హత సాధించారు. వీరిలో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో అర్హత సాధించారు. ఆ లెక్కన చూస్తే మొత్తం 1.09 లక్షల మంది అభ్యర్ధులు అర్హత సాదించినట్లు తేల్చారు. ఈ లెక్కన ఒక్కో పోస్టు కోసం సగటున ఆరుగురు పోటీ పడుతున్నారు.
పోలీస్ యూనిట్ల వారీగా ఉన్న ఖాళీల ఆధారంగా ఆయా జిల్లాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం కటాఫ్ మార్కులే ప్రాతిపదిక కానున్నాయి. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల ఖాళీల ఆధారంగానే కటాఫ్ మార్కుల్ని నిర్ణయించనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేయనున్నారు.
ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలనే ప్రణాళికల్లో ఉన్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 500-600 మంది అభ్యర్థులను పిలవనున్నారు. జూన్ మూడో వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.