AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలో తెలంగాణ పోలీసులపై నిందితుడి బంధువులు, అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో పోలీసు వాహనంపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో చేతులకు బేడీలు ఉన్నప్పటికీ చోరీ కేసు నిందితుడు షేక్ జాఫర్ పరారయ్యాడు. అనంతరం మహారాష్ట్ర పోలీసులు అతడిని మళ్లీ అరెస్ట్ చేయగా, పోలీసులపై దాడికి పాల్పడిన 12 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Telangana Police Attack
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 7:35 AM

Share

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో తెలంగాణ పోలీసుల బృందంపై ఓ గుంపు దాడికి పాల్పడింది. ఓ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తుండగా.. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు చిక్లీ ఎక్స్ రోడ్డు వద్ద ఆదిలాబాద్ జిల్లా పోలీసులపై నిందితుడి తరుపు బంధువులు, అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో పోలీసు వాహనంపై విరుచుకుపడ్డారు. ప్రాణరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడటంతో దాడికి పాల్పడ్డ మూక పరారైంది. ఇదే సమయంలో నింధితుడు సైతం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యడు. చేతికున్న బేడీలతోనే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు నిందితుడు షేక్‌ జాఫర్‌.

విషయంలోకి‌ వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన ఆటోరిక్షాను పోలీసులు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకా చిఖ్లీ ప్రాంతంలో గుర్తించారు. ఈ కేసులో చోరీకి పాల్పడ్డ షేక్ బకర్ అలియాస్ జాఫర్ షేక్‌ కిన్వాట్ లో తలదాచుకున్నాడని గుర్తించిన బజార్ హత్నూర్ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆగష్టు 30 న కిన్వట్ కు వెళ్లారు. పక్కా వ్యూహాం అమలు చేసి‌ నిందితుడైన షేక్ జాఫర్‌ను నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ పట్టణంలో అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లాకు బయలు దేరారు. అంతలోనే నిందితుడి అరెస్ట్ విషయం లీక్ అవడంతో నిందితుడిని తప్పించేందుకు.. కిన్వట్‌ సమీపంలోని గోకుల్‌నగర్‌ ప్రాంతంలో మాటు వేసిన నిందితుడి అనుచర ముఠా పోలీసుల వాహనంపై రాళ్లతో దాడి పాల్పడ్డారు. అల్లరి మూకల నుండి నిందితుడిని తప్పించి ఆదిలాబాద్ వైపు వేగంగా వెళుతున్న బజార్‌ హథ్నూర్‌ పోలీసుల కారును చిక్లీ గ్రామ సరిహద్దు వద్ద అడ్డుకున్న మరో ముఠా కర్రలు, రాళ్లతో సినీ ఫక్కీలో పోలీసులపై దాడులకు తెగపడ్డారు. ఆకస్మిక దాడితో నిందితుడిని తీసుకెళ్తున్న పోలీసులకు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ గందరగోళంలో చేతులకు బేడీలు ఉండగానే షేక్ జాఫర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

పరిస్థితి అదుపు తప్పడంతో బజార్ హత్నూర్ పోలీసులు ఆత్మరక్షణ కోసం గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పరారైన నిందితుడితో పాటు అతడిని తప్పించేందుకు సహకరించి.. ఆదిలాబాద్ జిల్లా పోలీసులపై దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాఫర్ స్వగ్రామమైన చిక్హలీ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

వీడియో చూడండి..

ఈ ఘటనపై బజార్ హత్నూర్ ఎస్సై రమేశ్ పరశురామ్ గోక్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిన్వట్ పోలీసులు కేసు నమోదు చేసి‌ దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని‌ పట్టుకునేందుకు రంగంలోకి‌ దిగిన మహారాష్ట్ర పోలీసులు స్వగ్రామం చిక్లీ నుండి నిందితుడు‌ షేక్ బకర్ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఆగస్టు 31 న సోమవారం మరొసారి నిందితుడు జాఫర్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ పోలీసులపై దాడికి పాల్పడ్డ 12 మందిని‌ గుర్తించి అరెస్ట్ చేసినట్టు‌ పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశం అయింది.

Follow Us