తెలంగాణ పేదలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సొంతగా స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు.. ప్రభుత్వం 3 లక్షల రూపాయలు సాయం చేయనుంది. ఒక్కో నియోజకవర్గంలో 2వేల మందికి ఇలా సాయం అందిచనున్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసన సభలో ప్రకటన చేశారు. నిధుల కేటాయింపు సైతం పూర్తయ్యింది. అంతేకాదు.. సీఎం కోటాలో మరో 25వేల మందికి ఈ ఆర్థిక సాయం అందనుంది. మొత్తం మీద ఈ స్కీమ్ ద్వారా 2.63లక్షల మందికి 7,890 కోట్లు ఇవ్వనున్నట్లు హరీశ్ తెలిపారు.
అలాగే ఈసారి బడ్జెట్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 12వేల కోట్లు కేటాయించారు. GHMC పరిధిలో 67,782 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే కంప్లీట్ అయ్యిందని హరీశ్ రావు వెల్లడించారు. 32,218 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని తెలిపారు. మరోవైపు బడ్జెట్‌లో ఓల్డ్ సిటీ మెట్రోకు 500 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు 15,00 కోట్లు అలాట్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులకు బడ్జెట్‌లో తీపికబురు అందించారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్‌ను సవరిస్తామని చెప్పారు.
ఇది ఎన్నికల ఏడాది. అంటే ఓట్ల పండుగ. ప్రభుత్వానికి పరీక్ష. కాబట్టే జనం మెచ్చేలా, అభివృద్ధి పరుగులు పెట్టేలా, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మరో పది నెలల్లో ఎన్నికల జరగబోతున్న వేళ నిధుల వరద పారేలా పద్దుల్ని పెట్టింది. జనం సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కరించేలా, నిధులు కొరత రాకుండా, స్థానిక సంస్థల్లో కాసులు గలగలాడేలా కేటాయింపులు చేసింది. బడ్జెట్ అద్భుతం అంటోంది BRS. అన్నివర్గాలకు సముచితంగా కేటాయింపులు చేశామని చెబుతోంది. విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. ఊరించి ఉసూరు మనిపించారని మండిపడుతున్నాయి. కొత్త పథకాల సంగతి పక్కన పెడితే.. ఉన్నవే తొలగించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం