
సహజంగా గ్రామాల్లో కొద్దిగా రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లు ఎలాంటి ఎన్నికలు వచ్చినా హడావిడి ఎక్కువగా ఉంటుంది. 2019 సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు లోకల్ ఫైట్ జరగకపోవడంతో గ్రామాల్లో చాలామంది ఆశావాహులు పెరిగిపోయారు. సిటీకి దగ్గరగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల నాయకులు తమ తమ గ్రామాల పరిధిలో సర్పంచ్ స్థానానికి తామయితేనే కరెక్ట్ అని నిర్ణయించుకొని పోటీకి సిద్ధమయ్యారు.
గ్రేటర్ సిటీకి దగ్గరగా ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే.. కార్పొరేషన్ మున్సిపాలిటీలకు శివారు గ్రామాలుగా ఉండడం ఈ పంచాయతీలకు మరొక ప్లస్ పాయింట్. గ్రేటర్ శివారులోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ గా ఎన్నికైతే రాష్ట్రస్థాయి నాయకులతో టచ్ లో ఉండడంతో పాటు. గ్రామానికి రావలసిన అభివృద్ధి నిధులు, ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందని ద్వితీయశ్రేణి నాయకుల నమ్మకం. దీంతో హైదరాబాద్ నగరానికి పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా గ్రామ సర్పంచులకు డిమాండ్ బాగా పెరిగింది.
గ్రామాల్లో ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు దాదాపు అంతా సిద్ధం కావడంతో.. ఏకగ్రీవంపై ఫోకస్ పెంచారు నాయకులు. ఇటు పార్టీ పరంగా గ్రామాల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నం చేస్తూనే.. గ్రామంలో తనకున్న పలుకుబడితో గ్రామ అభివృద్ధికి హామీలు ఇస్తూ ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఈ ఏకగ్రీవంగా ఎన్నికవడం కోసం కొందరు నేతలు కోట్లు ఖర్చు చేసేందుకు సైతం వెనకాడడం లేదు.
రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ కు మంచి డిమాండ్ ఉండడంతో.. ఆశావాహులు సైతం ఖర్చుకు వెనకాడకూడదని.. సర్పంచ్ పదవి కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు,మహేశ్వరం,శంషాబాద్ పరిధిలోని కొన్ని గ్రామాలు, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల లోని గ్రామాల సర్పంచ్ పదులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
ఏది ఏమైతేనే ఏకగ్రీవంగా నైనా, స్థానికంగా తమకు ఉన్న పలుకుబడితోనైనా సర్పంచ్ పదవి దక్కించుకొని రాష్ట్రస్థాయి నాయకులకు టచ్లోకి వెళ్లాలని చాలా మంది ఆశవాహులు ప్రయత్నిస్తున్నారు. ఇది వారు రాజకీయంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశావాహులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.