అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి. పోలీసులు అతన్ని వెంబడించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య (65) అనే వ్యక్తి గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. ఐతే శుక్రవారం తెల్లవారుజామున భర్త మృతి చెంది ఉండడాన్ని ఆయన భార్య చంద్రవ్వ గమనించింది. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. అందుకు మల్లయ్య కుటుంబసభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని మల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడని, ఆయన మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదంటూ శ్మశానవాటిక వైపు పరుగులు తీశాడు. ఐతే పోలీసులు ఆయన్ని వెంబడించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్ సాంబశివరావు తెలిపారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.